calender_icon.png 18 January, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా కోరల్లో కొత్త చెరువు

01-09-2024 01:45:08 AM

  1. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ప్లాట్లు చేసి విక్రయించిన అక్రమార్కులు 
  2. 28.19 ఎకరాలకు గాను మిగిలింది 4 ఎకరాలే 
  3. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల్లో రికార్డుల మాయం 

వికారాబాద్, పరిగి, ఆగస్టు 30 (విజయక్రాంతి): అక్రమార్కుల చెరలో కొత్త చెరువు కుచించుకుపోయింది. చెరువు ఆక్రమణ అనంతరం ఆ స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించిన ఆక్రమణదారులు పత్తాలే కుండా పోగా.. వారి మాయమాటలు విని ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల ఆక్రమణపై కొరడా ఝుళిపిస్తుండటంతో కొత్త చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్లాట్లు కొన్నవారు అయోమయంలో పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కొత్త చెరువులోని మెజార్టీ భాగాన్ని కొందరు అక్రమార్కులు కబ్జాచేయడంతో పాటు ప్లాట్లు చేసి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు.. చెరువు కట్ట, తూమును పగుల గొట్టారు. చెరువులోకి నీరు వచ్చే కాలువలను సైతం దారి మల్లించేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేసి అమ్మేశారు.

28 ఎకరాల్లో మిగిలింది నాలుగు ఎకరాలే..

పరిగి మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువు దాదాపు 50 ఏళ్ల క్రితం సర్వేనంబర్ 254లో 13 ఎకరాలు, సర్వే నంబర్ 256 లో 2.12 ఎకరాలు, సర్వే నంబర్ 257లో 12.19 ఎకరాల్లో మొత్తం 28.18 ఎకరాల్లో కొత్త చెరువు నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ఈ చెరువు ఆయకట్టు దాదాపు 12వేల ఎకరాలుగా ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. చెరువు నిర్మాణం అనంతరం దీని కింద రెండు దశాబ్దాలపాటు పంటలకు సాగునీరు అందిం ది. అయితే కొత్త చెరువు అప్పటి గ్రామ పచాయతీ అయిన పరిగికి సమీపంలో ఉండ టం.. క్రమంగా పరిగి పంచాయతీ మున్సిపాలిటీగా మారడం.. మున్సిపాలిటీ రోజురో జుకు విస్తరింస్తుండటంతో అక్రమార్కుల కన్ను కొత్త చెరువుపై పడింది.

కన్ను పడిందే తడువు.. నాయకుల, అధికారుల సహకారంతో చెరువులో నీరు నిల్వ కాకుండా కుట్రలు పన్నారు. మరికొన్నాళ్లకు కట్టను, తూమును మూడోకంటికి తెలియకుండా ధ్వంసం చేశారు. చెరువుకు ఓ పక్క నుంచి ప్లాట్లు చేసి అమ్మడం ప్రారంభించిన అక్రమార్కులు.. 28.19 ఎకరాల్లో దాదాపు 80 శాతం భూమిని ప్లాట్లు చేసి అమ్మేశారు. చెరువు భూమిని ప్లాట్లు చేసి అమ్ముతున్నారేంటి అని అప్పట్లో కొందరు ప్రశ్నించగా.. ఇది మా ముత్తాతల పేరుమీద ఉన్న భూమి అని దబాయించారనే ఆరోపణలున్నాయి. అధికారుల సహకారంతో వారి పేరుమీదికి మార్చుకొని ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇలా ఏళ్లుగా అక్రమార్కుల కబ్జాల పర్వం కొనసాగడటంతో.. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారుల లెక్కల ప్రకారం కొత్త చెరువు కేవలం నాలుగు ఎకరాలకే పరిమితమైంది.

ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి పరిస్థితి ఏంటి?

కొత్త చెరువు స్థలంలో ఇప్పటికే అనేక నిర్మాణాలు వెలిశాయి. కొనుగోలు చేసే సమయంలో కనీసం చెరువు స్థలం అని కూడా ఆలోచించకుండా గుడ్డిగా కొనేశారు. అమ్మినవారికి ఇబ్బంది లేకపోయినప్పటికీ.. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో ప్లాట్లు కొని ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి పరిస్థితి ఏంటా అని ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వంటి చట్టాలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

రికార్డులు మాయం

పరిగి పట్టణవాసులకు ప్రస్తుతం కొత్త చెరువు పేరు చేపితే కనీసం అది ఎక్కడ ఉందో చెప్పలేని పరిస్థితి ఉంది. దీనికి తోడు చెరువుకు సంబంధించిన ఎలాంటి దస్త్రాలు కూడా ఇరిగేషన్ శాఖ వద్ద లేనట్లు సమచారం. ఇదే విషయమై ఇరిగేషన్ అధికారులను సంప్రదించగా కొత్త చెరువుకు సంబంధించి ఎలాంటి పత్రాలు తమవద్ద లేవని తేల్చిచెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రికార్డుల ప్రకారం కొత్త చెరువు మాత్రం నాలుగు ఎకరాల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.

హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఇప్పటికే అలెర్టున కొత్త చెరువును చెరబట్టిన నాయకులు ముందు జాగ్రత్తగా.. చెరువుకు సంబంధించిన దస్త్రాలను.. ఇరిగేషన్, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులతో కుమ్మకై ఆయా కార్యాలయాల్లో దస్త్రాలను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2003 నుంచే ఈ చెరువుపై కన్నేసిన అక్రమార్కులు ఏటా కొంత ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్మినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొత్త చెరువు స్థలంలో దాదాపు 24 ఎకరాల స్థలం కబ్జా చేసి లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేశారు. గత 20 ఏళ్లలో కొత్త చెరువు ప్రాంతంలో 4వేల పై చిలుకు ప్లాట్ల క్రయవిక్రయాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.