టాలీవుడ్‌కు మరో కొత్త హీరో పరిచయమవుతున్నాడు. ఆ యువ పేరు మారిశెట్టి అఖిల్. ఇంకా టైటిల్ ఖరారు కాని నూతన చిత్రంలో అఖిల్ సరసన భానుశ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే కొబ్బరికాయ కొట్టేశారు. శ్రీధన్ దర్శకత్వంలో ఏకే టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని నిర్మాత, హీరో సొంత గ్రామమైన లక్ష్మీపురంలో ఉన్న రామాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత నట్టికుమార్ క్లాప్ నిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాలని, షూటింగులు ఆంధ్రప్రదేశ్‌లో చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించారు.
అందుకు అనుగుణంగా చిన్న సినిమా నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చి, షూటింగులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో టూరిజం లొకేషన్స్‌ను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉంది. పాడేరు, అరకు, విశాఖ వంటి తదితర లొకేషన్స్‌లో షూటింగులకు అనువైన లొకేషన్స్‌ను గుర్తించి, వాటి అభివృద్ధితోపాటు నిర్మాతలకు అక్కడ షూటింగులు చేసుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ కింద త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి. చిన్న సినిమాల మనుగడకు తగిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అనకాపల్లి రాజకీయాల్లో మంచి పేరున్న మారిశెట్టి శ్రీకాంత్ తన కుమారుడి ఆసక్తిని గమనించి, సినిమా నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయం’ అన్నారు. హీరో మారిశెట్టి అఖిల్ మాట్లాడుతూ.. ‘మొదట్నుంచీ నాకు సినిమా రంగమంటే ఎనలేని మక్కువ. హీరో కావాలన్న నా అభిరుచికి మా నాన్న మద్దతు పలికారు.
దాంతో నా నటనకు మెరుగులు దిద్దుకునేందుకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఫిలిం యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పొందాను. తప్పకుండా ఈ తొలి చిత్రం ఇండస్ట్రీలో నా కెరీర్‌కు బాటలు వేస్తుందని భావిస్తున్నాను’ అన్నాడు. ‘ప్రేమకథా చిత్రమిది. హారర్, కామెడీ అంశాలతో వైవిధ్యంగా దీన్ని మలచబోతున్నాం’ అని దర్శకుడు శ్రీధన్ అని తెలిపారు. నిర్మాత మారిశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం షూటింగ్ లక్ష్మీపురం చుట్టుపక్కల ఐదు రోజులపాటు జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక పాట, ఒక ఫైట్ చిత్రీకరణ జరుపుతాం. ఆ తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం, అరకు తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేస్తాం. త్వరలో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి మిగతా అన్ని విషయాలను వెల్లడిస్తాం’ అని చెప్పారు.