27-04-2025 01:12:59 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య రాజకీయాలు మారిపోయాయి.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే.. సోష ల్ మీడియాతో అంతా మారిపోయింది.
పాతతరం రాజకీయం ఒకరకంగా అంతరించిపోయింది..ఇప్పుడు రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి’ అని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. హెచ్‌ఐసీసీలో జరిగిన భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ హాజరై మాట్లాడారు.
భారత్ సమ్మిట్‌కు శుక్రవారమే రావాల్సి ఉండగా, కశ్మీర్‌కు వెళ్లడం వల్లే ఇక్కడికి రాలేకపోయానని, క్షమించాలన్నారు. భారత్ సమ్మి ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వాలు మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నాయని, ప్రతిపక్షాలను అణిచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని, విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదని, అందుకు ప్రతిపక్షాలు తమ వాదన ను వినిపించుకునేందుకు కొత్తదారులు వెతుక్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
విద్యా, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు ఆయన వివరించారు. పాదయాత్ర మొదలుపెట్టిన 10 రోజుల తర్వాత చూస్తే తనతో నడిచేవారి సంఖ్య పెరిగిపోయిందన్నారు.
పాదయాత్ర తనకు ఎంతగానో ఉపయోగపడిందని, ఎంతోమందిని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నానని అన్నారు. సగం దూరం నడిచిన తర్వాత ప్రజలతో ఎలా మాట్లాడాలో..వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజల సమస్యలను వినటంలో నాయకులు విఫలమయ్యారన్నారు. కొత్తతరం భాషను రాజకీయ నాయకులు అర్థం చేసుకుని, కొత్త తరాన్ని ప్రోత్సహించాలని, యువనేతలను తయారుచేయాలని రాహుల్‌గాంధీ సూచించారు.
కొత్త రాజకీయాలను నిర్మిద్దాం..
ఇండియాలో కొత్త రాజకీయాలను నిర్మిద్దామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. అందరి ఆలోచనలు స్వీకరించి నూతన విధానాన్ని కొనసా గిద్దామ న్నారు. ‘పాదయాత్రలో ఒక అమ్మా యి వచ్చి ఐ లవ్‌యూ అని చెప్పింది.. ఆ తర్వాత నేను కూడా నా ఇష్టాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ వచ్చాను. అప్పటినుంచే ప్రజలతో ప్రేమ, అప్యాయతను పంచుకోవడం మొదలుపెట్టా.
నేను ఎప్పుడైతే ప్రజలపై నా ప్రేమను వ్యక్తపర్చానో అప్పటినుంచి అందరూ స్పందిస్తున్నారు. పాదయాత్రలో అనేకమందిని కలిసిన తర్వాత హిందీలో ఒక స్లోగన్ తీసుకున్నాం. విద్వేషపు బజారుల్లో ప్రేమదుకాణాన్ని తెరిచా (నఫ్రత్ కే బజార్ మే.. మహబత్‌కే దుకాన్) అని పేర్కొన్నారు.
దేశం లో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడా సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గాలు వెతుక్కుంటున్నారని అన్నా రు. నాయకులు కూడా ప్రజలు చూపించిన మార్గాల్లోనే వెళ్లాలని సూచించారు. విద్వేశ రాజకీయాలు చేయకుండా ప్రజలకు ప్రేమ ను పంచాలన్నారు.