10 June, 2026 | 4:50 AM

తెలంగాణ భవిష్యత్తుకు నవ శకం

10-06-2026 12:00 AM

నేడు సీఎం రేవంత్ చేతుల మీదు ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభం

రూ.20 కోట్లతో 8 నెలల రికార్డు కాలంలో నిర్మాణం పూర్తి

ఇకపై ఇక్కడి నుంచే అనుమతులు

కమిషనర్‌గా శశాంక పర్యవేక్షణ

రంగారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ) కల సాకార దిశగా తొలి భారీ అడుగు పడనుంది. ఈ మెగా ప్రాజెక్టును శాసించే లీడ్ ఆఫీస్ సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి బుధారం ‘ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ’ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయం అందుబాటులోకి రావడంతో ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులు, పాలనా వ్యవహారాలు ఇకపై రాకెట్ వేగంతో దూసుకుపోనున్నాయి.

రికార్డు సమయం.. అద్భుత నిర్మాణం

ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ కార్యాలయ నిర్మాణ వేగమే సజీవ సాక్ష్యం. దాదాపు రూ.20 కోట్ల భారీ వ్యయంతో, 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, కేవలం 8 నెలల రికార్డు కాలంలోనే అన్ని హంగులతో ఈ భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక సాంకేతికత, కార్పొరేట్ లుక్తో రూపుదిద్దుకున్న ఈ కార్యాలయం నుంచే నగర భవిష్యత్ ప్రణాళికలు రూపుదిద్దుకోనున్నాయి.

ఫ్యూచర్ సిటీ పరిధిలో జరిగే అభివృద్ధి పనులు, భవన నిర్మాణాలు, లే-అవుట్లు, పరిశ్రమలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ కార్యాలయం సింగిల్ విండోలా పనిచేయనుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె.శశాంక నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు, నిపుణుల బృందం ఇక్కడి నుంచే పర్యవేక్షించనుంది.

త్వరితగతిన క్లియరెన్స్

పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా అనుమతులు ఇచ్చేలా ఇక్కడ వ్యవస్థలను డిజైన్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాల సరసన ప్రపంచస్థాయి మౌలిక వసతులతో ‘ఫోర్త్ సిటీ’ని నిలబెట్టడం, ఐటీ, కృత్రిమ మేధస్సు, ఫార్మా, స్పోరట్స్ హబ్‌గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడమే ఈ అథారిటీ ప్రధాన లక్ష్యం.

ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి శ్రీథర్‌బాబు

కందుకూరు (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో బుధవా రం ఒక చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ఈ మెగా ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో అధికారికంగా ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఈ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు, పీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.