దేశ న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది.బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్( ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( సీఆర్‌పీసీ) ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్( ఐవీఏ) చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో కొత్త న్యాయ, నేర చట్టాలయిన భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ సోమవారంనుంచి అమలులోకి వచ్చాయి. వాస్తవానికి ఆదివారం అర్ధరాత్రినుంచే పాత చట్టాలు రద్దయ్యాయి. బ్రిటీష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా న్యాయం అందించేందుకు కొత్త చట్టాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
కొత్త చట్టాల్లో జీరో ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు ఎస్‌ఎంఎస్ పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరిగా వీడియోల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా కేంద్రప్రభుత్వం మార్చింది. కులం, మతంలాంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే పాత చట్ట ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండగా ఇప్పుడు యావజ్జీవ శిక్ష విధించే వీలుంది. నకిలీ నోట్ల తయారీ, స్మగ్లింగ్‌ను ఉగ్రవాదం పరిధిలోకి తీసుకెళ్లారు.
కాగా మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయాన్ని మోడీ సర్కార్ చేర్చింది.మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా కొత్త నిబంధనను చేర్చింది. పెళ్లి పేరుతో మహిళలను మోసగించి కోర్కె తీర్చుకుని వదిలిపెట్టే కేసులకోసం కొత్త నిబంధనను తీసుకొచ్చింది.కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు.
కాగా కొత్త చట్టాలు మన సమాజాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. చిన్న నేరాలను, ఘోరమైన నేరాలను ఒకే గాటన కట్టే పద్ధతి ఈ చట్టాల వల్ల మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే కొత్త చట్టాలను చేసినంతమాత్రాన శీఘ్ర న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే కింది కోర్టులు మొదలుకొని సుప్రీంకోర్టు దాకా అపరిష్కృత కేసులు కొండల్లా పేరుకు పోయి ఉన్నాయి.
వీటన్నిటినీ పరిష్కరించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. అలాగే సుశిక్షిత ఫోరెన్సిక్ నిపుణులను తయారు చేసుకోవాలి. వ్యవస్థలో పేరుకుపోయిన ఇలాంటి లోపాలను తొలగించడానికి కొత్త చట్టాలు తోడ్పడాలి. అప్పుడే అనుకొన్న లక్ష్యం నెరవేరుతుంది. అలాగే నాగరిక్ సురక్షా సంహితలో పోలీసు కస్టడీ సమయాన్ని ఇప్పుడున్న 15 రోజులనుంచి 6090 రోజులకు పెంచారు. ఇది పౌర హక్కులకు భంగకరమన్న అభ్యంతరం వ్యక్తమవుతోంది.
సంఘటిత నేరాలు, ఉగ్రవాద చర్యలకు ఇచ్చిన నిర్వచనం మరీ విస్తృతంగా ఉండడంతో అవి దుర్వినియోగం కావచ్చన్న ఆందోళన ఉంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రావలసి ఉంది. కాగా కొత్త చట్టాలను ఆమోదించిన తీరుపై ప్రతిపక్షాలుగతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఇప్పుడు తొలి రోజే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్రలోని సావంత్‌వాడిలో కొత్త చట్టాల కింద నాలుగు కేసులు నమోదయ్యాయి.
ఇవన్నీ కూడా ఫుట్‌పాత్ వ్యాపారం లాంటి సాధారణ నేరాలకు సంబంధించినవే. పార్లమెంటులో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బలవంతంగా కొత్త చట్టాలను ఆమోదించుకున్నారని, అలాంటి చట్టాలను అప్పుడే పోలీసులు అత్యుత్సాహంతో అమలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ ట్వీట్‌లో విమర్శించారు. పార్లమెంటును నడపడానికి ‘బుల్‌డోజర్ న్యాయం’ను ఇండియా కూటమి ఇక ఎంతమాత్రం అనుమతించదని కూడా ఆయన స్పష్టం చేశారు. .