calender_icon.png 23 October, 2024 | 5:08 AM

నిజాం తరహాలోనే కొత్త అసెంబ్లీ

23-10-2024 02:47:52 AM

  1. మూడు నెలల్లో అందుబాటులోకి  
  2. ఒకేచోట అసెంబ్లీ, కౌన్సిల్ హాల్‌లు 
  3. మంత్రులు కోమటిరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని అదే నిర్మాణ శైలితో అద్భుతంగా పునరుద్ధరిస్తామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం పాత అసెంబ్లీ భవన పునర్నిర్మాణంపై స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్‌తో కలిసి భవన నిర్మాణ పురోగతిపై మంత్రులు సమీక్షించారు.

భవనాన్ని పునర్నిర్మిస్తున్న ఆగాఖాన్ ప్రతినిధులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచార్యులుతో ఇరువురు మంత్రులు సమావేశం నిర్వహించారు. రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఎక్కడా చారిత్రక వైభవానికి ఇబ్బందులు లేకుండా భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

భవనానికి కావల్సిన ఎలక్ట్రిఫికేషన్ వ్యవస్థ, ప్లంబింగ్ పనులపై టెండర్లు పిలవాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ప్రజోపయోగమైన పనులు ఆపొద్దని అధికారులకు మంత్రి సూచించారు.

ఈ హెరిటేజ్ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్ హాల్‌ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చని, పార్లమెంట్ తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే అసెంబ్లీ అందరికీ మరింత చేరువ అవుతుందని తెలిపారు. పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక గదులను నిర్మించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

పనుల వేగిరానికి ఎస్‌ఈ స్థాయి అధికారి..

పనులు వేగంగా సాగేందుకు ప్రత్యేకంగా ఒక ఎస్‌ఈ స్థాయి అధికారిని నియమించి పనులను పర్యవేక్షించాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. పనుల్లో అలసత్వానికి తావులేకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. లోక్‌సభ, రాజ్యసభలో ఉన్నట్టుగానే అసెంబ్లీ భవన ప్రాంగణంలోనే సెంట్రల్ హాల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

తన ఐటీ శాఖ ద్వారా అసెంబ్లీకీ అవసరమైన నెట్ వర్కింగ్ సేవలను అత్యాధునికంగా అందిస్తామని, ఇందుకు కావాల్సిన ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే ఆమోదం తెలుపుతానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన ఉన్నారు.

కేటీఆర్ ఈఆర్‌సీ వద్దకు వెళ్లడం ఓ జోక్ 

విద్యుత్ ఛార్జీల విషయంపై ఈఆర్సీ వద్దకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  వెళ్లడం ఒక పెద్ద జోక్‌గా మంత్రి కోమటిరెడ్డి  అభివర్ణించారు. లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు రాకున్నా, అసెంబ్లీలో చిత్తుగా ఓడినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్లకు తమ ప్రభుత్వం ఇస్తోందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి రాష్ర్ట అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకువచ్చారని ప్రశ్నించారు.