టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశం
న్యూఢిల్లీ: నెట్‌వర్క్ బాగుంటుంది కదా అని ఫలానా కంపెనీ సిమ్‌కార్డు తీసుకోవడం, తీరా మనం నివసించే ప్రాంతంలో ఆ కంపెనీ నెట్‌వర్క్ సరిగా లేకపోవడంతో ఎంతో మంది ఇబ్బందులు పడటం తెలిసిందే.ఈ క్రమంలో టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైర్‌లెస్ టెలికాం ప్రొవైడర్లు జియో స్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను తమ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
అంటే ఏయే ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుందో ఆ మ్యాప్‌లలో చూపించాల్సి ఉంటుంది. 2జీ మొదలుకొని 5 జీ సర్వీసులకు సంబంధించి కవరేజ్ వివరాలు అందులో కనిపిస్తాయి. దీనివల్ల తమ ప్రదేశంలో ఏ నెట్‌వర్క్ లభి స్తుందో వినియోగదారుడు తెలుసుకునే వీలు కలుగుతుం దని ట్రాయ్ తెలిపింది. టెలికాం ప్రొవైడర్లతో పలు అంశాలపై చర్చిస్తున్న ట్రాయ్ ఈ అంశాన్నీ చర్చకు పెట్టింది. దీనిపై ఆయా కంపెనీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ట్రాయ్ తుది మార్గ దర్శకాలను విడుదల చేసింది.