- న్యూడ్ కాల్ చేసి డబ్బుల డిమాండ్
- పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అధికారి
జనగామ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు ఓ జిల్లా అధికారిని టార్గెట్ చేశారు. ఓ యువతి ఐడీతో వాట్సాప్‌కు వీడియో కాల్ చేసి, అసభ్యంగా ఉన్న ఆ వీడియో కాల్‌ను రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన జనగామ జిల్లాలో శనివారం వెలుగుచూసింది.
కీలక విభాగానికి చెందిన ఓ జిల్లా అధికారి ఆఫీస్ నంబర్‌కు శుక్రవారం గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఓ యువతి నగ్నంగా కనిపించింది. ఆ వీడియో చూసి కంగుతిన్న సదరు అధికారి వెంటనే కాల్ కట్ చేశాడు.
కొద్దిసేపటికే మరో వ్యక్తి ఫోన్ చేసి మీరు నగ్నంగా ఉన్న యువతితో వీడియో కాల్ మాట్లాడిందంతా రికార్డు చేశామని, తమకు డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని హెచ్చరించారు. అధికారి స్పందించకపోవడంతో మరో వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.
తాము సైబర్ క్రైం నుంచి మాట్లాడుతున్నామని, యువతితో నగ్నంగా మాట్లాడిన సంభాషణ యూట్యూబ్‌లో పెట్టారని, అది తొలగించాలంటే ఒకరిని సంప్రదించాలంటూ ఓ నంబర్ ఇచ్చారు. సదరు నంబర్‌కు ఫోన్ చేయగా రూ.30 వేలు ఇస్తేనే యూట్యూబ్‌లో వీడియో డిలీట్ చేస్తామని బదులిచ్చారు. ఇదంతా సైబర్ నేరగాళ్లే చేస్తున్నారని గ్రహించిన సదరు అధికారి జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.