19-04-2025 12:38:31 AM
గజ్వేల్, ఏప్రిల్ 18: గజ్వేల్ నియోజకవర్గం గత రెండున్నర ఏండ్లుగా అప్పుల మ యంగా మారింది. మూడేళ్ల క్రితం సీఎం నియోజకవర్గం కావడంతో ప్రభుత్వ పనులు చేస్తే డబ్బులు గ్యారెంటీగా వస్తాయన్న నమ్మకంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ అభి వృద్ధి నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు చేశా రు. వీటిలో 90% వరకు పూర్తికాగా, మరో 10 శాతం పనులు పెండింగ్ లోనే నిలిచిపోయాయి.
చిన్న కాంట్రాక్టర్లు వేల నుండి లక్ష ల రూపాయల బిల్లు నిలిచిపోగా, పెద్ద కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు నిలిచిపోయాయి. నిర్మాణాలు పూర్తయిన వాటి కి అధికారులు చెక్కులు ఇవ్వడం, గడువు పూర్తి కావడంతో వాటిని తీసుకొని మళ్ళీ కొత్త చెక్కులు ఇవ్వడం ఇలా కొనసాగుతూనే ఉంది.
కానీ బిల్లులు మాత్రం రావడం లేదు. గ్రామపంచాయతీ నిధులు, గడా నిధులు, రాష్ట్ర అభివృద్ధి నిధులతో మంజూరైన ఏ ఒక్క పనికి కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పనులు చేయించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోగా, ప్రస్తుత ప్రభుత్వంలో పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ముందు రోజుల్లో 10% కమిషన్ తో కొందరి బిల్లులు చెల్లింపులు జరిగాయని పుకార్లు షికారు కొట్టడంతో ఆ విధంగాను పలువురు కాం ట్రాక్టర్లు ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. బిల్లుల చెల్లింపులో గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పులు తెచ్చి మరి పనులు పూర్తి చేయగా, వాటికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు బడా నాయకులు వారికి ధైర్యం చెబుతున్నా బిల్లులు మంజూరయ్యే పరిస్థితులు మాత్రం కనబడడం లేదు.
రియాల్టర్లదీ అదే పరిస్థితి...
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గజ్వేల్ నియోజకవర్గం రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుదేలైంది. గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్ గడిచిన పదేళ్ల కాలంలో సీఎంగా బాధ్యత నిర్వహించడంతో గజ్వేల్ లో ఎనలేని అభివృద్ధి జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో లక్షల విలువైన భూములు అమాంతం కోట్ల రూపాయల ధరలు పలికాయి. దీంతో వివిధ వ్యాపారాలు చేసేవారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా అవతారం ఎత్తారు.
దాదాపు తొమ్మిదేళ్లపాటు లక్షలు, కోట్లు సంపాదించగా, నిరుద్యోగులకు రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా మంచి సంపాదన లభించింది. చాలామంది చేసే పనులను మానుకొని రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా మారిపోయారు. రెండేళ్లుగా పరిస్థితి తారుమారైంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండే రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ధర పలుకుతాయన్న ప్లాట్ల భూముల యజమానుల ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా ధరలు సగానికి పడిపోయాయి. దీంతో అమ్మేవారు సగంధరకు అమ్మ లేక, సగంధర పెట్టి కొనుగోలు చేసినా తిరిగి మళ్లీ అమ్మే పరిస్థితులు లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. భూమిపైనే తాము సంపాదించిన డబ్బంతా పెట్టుబడి పెట్టి ప్లాట్లు, వ్యవసాయ పొలాలు కొనుగోలు చేసిన వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్నారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వ్యాపారం లేక అప్పులు చేస్తూ ఇబ్బందుల పాలుతున్నారు. కేవలం రియల్ వ్యాపారమే కాదు, కిరాణా, వస్త్ర, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ తదితర అన్ని వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న గిరాకీలు ప్రస్తుతం లేవని, దుకాణ అద్దెలు కూడా మోయలేని భారంగా మారాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందకు పైగా వ్యాపారులు తమ దుకాణాలను మూసేసుకున్నా రు. ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు మారుతాయో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.