calender_icon.png 22 December, 2024 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలకు పట్టం కట్టిన ఆధునిక ఋషి

15-10-2024 12:00:00 AM

నేడు అబ్దుల్ కలాం జయంతి :

శతాబ్దాల క్రితం జీవించి, దేశానికి  ఎనలేని సేవలందించిన ఎంతో మంది మహనీయుల గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం.  2015 వ సంవత్సరం వరకు మన ముందు గడిపి, దేశానికి ఎన్నో సేవలు చేసిన అబ్దుల్ కలాం గురించి మనందరికీ తెలుసు. కలాంను ఈ శతాబ్దంలోనే  అత్యంత గొప్ప వ్యక్తిగా పరిగణించాలి.

మనముందు జీవించి, మన కోసం జీవించి, గతించిన నిరుపమాన త్యాగధను డు కలాం. ఆయననిజాయితీ, నిబద్ధతను ప్రత్యక్షం గా చూసిన భాగ్యం మనతరానికి దక్కింది. కలాం ఒక  ఘనమైన కీర్తి కెరటం, మహోన్నత విజ్ఞాన శిఖరం.

ఎన్నో పదవుల్లో కొనసాగినా, ఎన్నో గౌరవాలతో సత్కరింపబడినా గర్వం దరిచేరకుండా, తాను నమ్మి ,ఆచరించిన సిద్ధాంతాలతో దేశ ప్రజ లు గర్వించేలా   జీవించిన అబ్దుల్ కలాం వంటి దార్శనికులను, దేశ భక్తులను భావితరాలు ఇక ముందు చూడబోవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

21 శతాబ్దంలో తన గుణగణాలతో, వ్యక్తిత్వంతో, అపారమైన దేశభక్తితో దేశ ప్రజలను విశేషంగా ఆకర్షించిన కలాం ప్రజల మనిషి. శాస్త్రవేత్తగా, క్షిపణి పితామహుడిగా, దేశభక్తుడిగా, రాష్ట్రప తిగా ప్రజల నీరాజనాలందుకుని మరణించినా, ప్రజల మనస్సుల్లో శాశ్వతమైన స్థానం సంపాదించుకున్న భారతరత్నం కలాం. కలాం ఆదర్శాలు ఆచరణీయాలు.

కలాం జీవితం  భారతీయులకు అత్యంత గర్వకారణం. భారతీయ విజ్ఞానం అమోఘమైనది, అనితర సాధ్యమైంది.  ప్రాచీన కాలం నుంచీ భారతదేశం విజ్ఞాన రంగంలో ముందంజలో ఉంది. శాస్త్ర,సాంకేతిక రంగాలు ప్రపంచానికి పరిచయం కాకముందే భారతదేశంలో మేధస్సు వికసించింది. అయితే అప్పట్లో మన పరిశోధనలకు, ప్రయోగాలకు ప్రాచుర్యం లభించలేదు.

నేడు ప్రపంచం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలోకి దూసుకుపోతున్నది. శాస్త్ర,సాంకేతిక రంగాల్లోను, అంతరిక్ష పరిశోధనా రంగాలలోను అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశరక్షణ అనేది ప్రతి దేశానికి తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలకు రక్షణావసరాలు అధికం. 

ఈ అవసరాన్ని గుర్తించే నాటి ప్రధాని ఇందిరాగాంధీ మొదలు రాజీవ్ గాంధీ వరకు, వాజపేయి నుండి నరేంద్ర మోడీ వరకూ భారతీయ రక్షణ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలతో చిరకాల శత్రత్వం వలన,పైగా అవి మనకు సరిహద్దు నున్న అణ్వస్త్ర దేశాలు కావడం వలన మనం కూడా అణ్వస్త్ర పాటవం కలిగి ఉండక తప్పడం లేదు.

భారతదేశం ఎప్పుడూ శాంతి కాముక దేశమే, పైగా ‘నో ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్’ అనే స్వయం నిబంధన విధించుకున్నాం. చైనా,పాక్‌ల విషయం లో మనం ఇప్పటికే చాలా మోసపోయాం. ఇక ఇలాంటి దేశాలతో ప్రమాదమని గ్రహించి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఫోఖ్రాన్-1 అణు పరీక్షలకు, వాజపేయి ప్రభుత్వం ఫోఖ్రాన్-2 అణు పరీక్షలకు సాహసం చేయడం జరిగింది. ఫోఖ్రాన్-2 అణుపరీక్షల్లో మన క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం పాత్ర శ్లాఘనీయం.

భారతదేశం అణ్వస్త్ర రంగంలో ముందంజలో ఉంటేనే శత్రుదేశాలకు వెన్నులో వణుకు పుడుతుందని కలాం భావించారు.ఆయన చొరవ ఫలించింది. భారతదేశంపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించినప్పటికీ, కలాంపై ఎన్ని వత్తిడులు వచ్చినప్పటికీ ఆయన తలొగ్గలేదు. అప్పటి ప్రభుత్వానికి కలాం చేసిన సూచనల ఫలితమే భారతదేశం అణ్వస్త్ర రంగంలో పురోగతి సాధించింది.

బోటు నడుపుకునే కుటుం బం నుంచి వచ్చిన అతి నిరుపేద అబ్దుల్ కలాం తన తల్లిదండ్రుల కష్టాలను చూసి,చలించి  తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలనే దృఢ నిశ్చయంతో  పేపర్ బాయ్‌గా పనిచేసి, భౌతిక శాస్త్రంలో పట్టా పొంది, మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎయిరో స్పేస్ ఇంజనీర్‌గా బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టడం జరిగింది.

డీఆర్‌డీఓనుంచి ఇస్రో వరకూ ఎక్కడ పనిచేసినా దేశం కోసమే కలాం తన సమయాన్నంతా వెచ్చించడం జరిగింది. హోమీ జహంగీర్ బాబా, సతీష్ ధావన్ లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు నేటి తరానికి తెలియకపోవచ్చునేమో గాని కలాం పేరు తెలియని వారం టూ ఎవరూ లేరు.

అబ్దుల్ కలాం కేవలం ఒక  శాస్రవేత్త, క్షిపణి పితామహుడు మాత్రమే కాదు ఆయ నలో ఒక తత్వవేత్త, ప్రకృతి ప్రేమికుడు,పర్యావరణ మిత్రుడు,రచయిత దాగివున్నాడు. ప్రతి ఒక్కరూ తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలని,అందుకోసం అహర్నిశలూ కృషి చేయాలని, దేశాభ్యున్నతి కి పాటుపడాలని నేటి తరానికి దశ, దిశ నిర్దేశించిన చైతన్య దీప్తి.

ఎన్ని అవార్డులు వచ్చినా, వాటికి అతీతంగా జీవించిన నిజమై న దేశభక్తుడు భారతరత్న అబ్దుల్ కలాం. ఆయన కీర్తి అజరామరం.ఆయన ఆశించిన నూతన భారత నిర్మాణం కోసం  యువ త, విద్యార్థిలోకం నడుం బిగించాలి.

 సుంకవల్లి సత్తిరాజు