- హర్యానాలో వలస కార్మికుడి హత్య
- ఇద్దరు మైనర్లు సహా ఏడుగురి అరెస్టు
- నాసిక్‌లోనూ ఓ వృద్ధుడిపై దాడి
హర్యానా, ఆగస్టు 31: గోమాంసం తిన్నాడనే అనుమానంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు సాబీర్ మాలిక్‌ను హర్యానాలోని గోసంరక్షక బృందం సభ్యులు కొట్టి చంపారు. ఆగస్టు 27న ఈ దారుణం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లు సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను విక్రయిస్తాడనే నెపంతో కొట్టగా స్థానికులు అడ్డుకోవడంతో మరో ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా చితకబాదడంతో మాలిక్ ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు.
మాలిక్ బంధ్రాలోని ఓ మారుమూల ప్రాంతంలో గుడిసెలో నివసిస్తాడని.. చెత్త, ఖాళీ బాటిళ్లు ఏరుకుని జీవనం సాగిస్తాడని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హర్యానా సీఎం స్పందిస్తూ.. రాష్ట్రంలో ఆవును గౌరవిస్తారని, కానీ ఇలాంటి మూకదాడులు జరగడం దురదృష్టకరమన్నారు.
నాసిక్ రైల్లో వృద్ధుడిపై దాడి
గోమాంసాన్ని తరలిస్తున్నాడనే అనుమానంతో రైలుతో వృద్ధుడిపై ప్రయాణికులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధులే ఎక్స్‌ప్రెస్‌లో ఇగత్‌పురిత సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.