ఎల్లుండి స్వామి వివేకానంద జయంతి :
వివేకానంద స్వామిని శ్రీరామకృష్ణులు కలుసుకున్న తొలినాళ్లలో జరిగిన సంఘటనలు ఆయన్ను ఆధ్యాత్మికత వైపు మళ్లించిన వైనాలు అత్యంత ఆసక్తికరం. ‘శ్రీరామకష్ణ పరమహంస- సమగ్ర సప్రామాణిక జీవితగాథ’ (రెండవ భాగం)లో శ్రీ శారదానంద స్వామి వాటిని ఊటంకించారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ విశేషాలు ‘విజయక్రాంతి- ప్రార్థన’ పాఠకుల కోసం..
సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడైన హామిల్టన్ తన దర్శన గ్రంథం ముగింపులో ఇలా రాశాడు: “జగన్నియామకుడైన భగవంతుడు ఒకడున్నాడనే సత్యాన్ని చూచాయగా మాత్రం తెల్పి ఊరుకొంటుంది మానవుడి మేధస్సు. అంతేగాని ఆ భగవంతుని స్వరూపం ఏమిటో వ్యక్తం చేయడం దానికి సాధ్యం కాదు. కాబట్టి, దర్శన శాస్త్రాలు ఇక్కడితో ఆగిపోతాయి.
దర్శనాలు ఎక్కడ ఆగిపోతాయో ఆధ్యాత్మికత అక్కడ ప్రారంభమౌతుంది”. హామిల్టన్ పై వచనాలు నరేంద్రుడి (స్వామి వివేకానంద పూర్వనామం) కి ఎంతో నచ్చాయి. మాటల సందర్భంలో అనేకసార్లు అతడు వాటిని ఉదహరించేవాడు. సాధనలలో నిమగ్నుడైనప్పటికీ నరేంద్రుడు తత్త్వశాస్త్ర అధ్యయనాన్ని విరమించలేదు. తన సమయాన్ని సంగీతం, ధ్యానం, అధ్యయనంలో గడపసాగాడు.
ధ్యానా భ్యాసం పట్ల అభిలాష
అప్పటి నుండి నరేంద్రుడు ఒక నూతన విధానంలో ధ్యానం అభ్యసించసాగాడు. భగవంతుణ్ణి సాకారునిగా లేదా నిరాకారునిగా ఎలా భావించినా సరే, మానవ భావాలను ఆరోపించే ఆయనను భావించక తప్పదు. ఈ విషయం అవగతం చేసుకోవడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మసమాజం నిర్దేశించిన తీరులో భగవంతుణ్ణి నిరాకార సగుణునిగా ఉపాసించేవాడు.
కానీ, అదికూడా ఒక రకంగా మానవభావమే అని ఇప్పుడు గ్రహించి ఆ పద్ధతిని విడిచిపెట్టాడు. ఇప్పటి నుండి, “హే భగవాన్! నీ యథార్థ స్వరూపాన్ని దర్శించే యోగ్యతను నాకు ప్రసాదించు” అని ప్రార్థిస్తూ, మనస్సును ఆలోచనారహితం చేశాడు. దానిని గాలి వీచని చోట ఉన్న దీపశిఖలా నిశ్చలంగా ఉంచడానికి ప్రయత్నించసాగాడు.
మొదటినుండి అతడి మనస్సు కట్టుబాటులో ఉండడం వల్ల ఒకింత కాలం ఈ విధంగా అభ్యాసం చేశాడో లేదో అతడి మనస్సు ఎంత తన్మయం చెందేదంటే అప్పుడప్పుడు అతడిలో దేహస్మృతి, కాల స్ఫురణ అదశ్యమై పోయేవంటే అతిశయోక్తి కాదు. ఇంట్లో అంతా నిద్రకు ఉపక్రమించిన తరువాత, అతడు తన గదిలో ధ్యానానికి కూర్చునేవాడు. అనేక సందర్భాలలో ఆ ధ్యానం రాత్రంతా కొనసాగడం కద్దు.
బుద్ధుని దర్శనం ఇలా..
పై ధ్యానాభ్యాస ఫలితంగా నరేంద్రుడికి ఒకరోజు అద్భుత దర్శనం ఒకటి కలిగింది. మాటల సందర్భంలో దాని గురించి మాకు ఇలా వర్ణించి చెప్పాడు: “మనస్సును నిశ్చలమూ అలోచనా రహితమూ చేయగానే దానిలో ప్రశాంత పరమానంద వాహిని ప్రవహించేది. ధ్యానానంతరం సైతం దాని ప్రభావం వల్ల ఒక రకమైన మత్తు చాలాసేపటి వరకూ నాలో ఉండిపోవడం కద్దు. కాబట్టి, కూర్చున్న చోటునుంచి వెంటనే లేవాలని నాకు అనిపించేది కాదు.
ఒక రోజు ధ్యానం ముగించి అలా కూర్చుని ఉన్నప్పుడు దివ్య తేజస్సుతో గదినంతా దేదీప్యమానం చేస్తూ ఒక అపూర్వ సన్న్యాసమూర్తి ఎక్కడ నుంచో హఠాత్తుగా వచ్చి నా ముందు, కాస్త దూరంలో నిలబడ్డాడు. ఆయన కాషాయాంబరాలు ధరించి, చేత కమండలం పుచ్చుకొని ఉన్నాడు. ఆయన వదనం అనిర్వచనీయమైన ప్రశాంతతకు ఆలవాలమై ఉంది. సమస్త నిషయాలపట్ల కానవచ్చే నిర్లిప్తతా వైఖరి నుంచి జనించిన ఆయన అంతర్ముఖత్వం నన్నెంతో విస్మయుణ్ణి చేసి, ఆకట్టుకొంది.
ఏదో చెప్పదలచుకొన్నట్లుగా నా వైపే తదేకంగా చూస్తూన్నాడు ఆ మూర్తి. నా వైపు మెల్లగా అడుగులు వేశాడు. అప్పుడు నేనెంతో భయపడ్డాను, స్థిరంగా ఉండలేకపోయాను. వెంటనే ఆసనం మీద నుంచి లేచి గది తలుపు తెరిచి గబగబా బయటకు వెళ్లిపోయాను. మరుక్షణమే ‘ఎందుకు అంత భయపడ్డాను?’ అనుకొన్నాను. ధైర్యం తెచ్చుకొని ఆ సన్న్యాసి చెప్పగోరుతున్నదేదో వినాలనే ఉద్దేశంతో మళ్లీ గదిలోకి వెళ్లాను. కాని ఆయన కనిపించలేదు. గదిలో చాలాసేపు ఎదురు చూశాను కాని ఫలితం లేకపోయింది.
ఆయన మాటలు వినకుండా అలా పారిపోవాలనే మూర్ఖత్వం నా కెందుకు కలిగిందా? అనుకొంటూ పశ్చాత్తాపంతో కుంగిపోయాను. నేను అనేకమంది సన్న్యాసులను చూశాను కాని, అటువంటి అద్భుత ముఖవైఖరి ఎన్నడూ, ఎవరిలోను చూడలేదు. ఆ ముఖారవిందం నా హృదయంలో పాదుకుపోయింది. అది నా భ్రమ కావచ్చునేమోగాని, ఆనాడు నేను భాగ్యవశాత్తు చూసిన ఆ మూర్తి బుద్ధ భగవానుడేనని నా దృఢ నమ్మకం.”
శారదానంద స్వామి
‘శ్రీరామకష్ణ పరమహంస
సమగ్ర సప్రామాణిక జీవితగాథ’ నుంచి..