సాంకేతిక లోపంతో చిట్యాలలో అత్యవసరంగా ల్యాండింగ్
నల్లగొండ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండల శివారులోని పంట పొలంలో గురువారం ఓ సైనిక హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఏపీలోని విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన రెండు హెలికాప్టర్లు ఉదయం హైదరాబాద్‌లోని హకీంపేటకు బయల్దేరాయి. చిట్యాల మండలం వనిపాకల శివారుకు రాగానే ఓ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం గుర్తించిన పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు యత్నించాడు. ఉదయం 11 గంటల సమయంలో పంట పొలాల్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అందులో ముగ్గురు సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత హకీంపేట నుంచి సాంకేతిక నిపుణుల బృందం వచ్చి మరమ్మతు చేశారు. సాయంత్రం 5 గంటల తరువాత హెలికాప్టర్‌లో సైనిక సిబ్బంది హకీంపేట చేరుకున్నారు.