- 8 కొత్త మెడికల్ కళాశాలలకు అనుమతులకు అవకాశం
- గతంలోలా తప్పులు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు
- ఇప్పటికే ఎన్‌ఎంసీకి ఫీజు చెల్లించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం త్వరలోనే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల అనుమతుల నిరాకరణకు గురైన 8 కొత్త మెడికల్ కళాశాలలకు త్వరలోనే మళ్లీ అనుమతులు రానున్నాయని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల లకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.
బోధన సిబ్బంది, తగిన మౌలిక వసతులు, పలు లోపాల కారణంగా లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) ఇచ్చేందుకు ఇప్పటికే ఎన్‌ఎంసీ నిరాకరించింది. చాలా కాలేజీల్లో అరకొర వసతులున్నాయని ఎన్‌ఎంసీ బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్‌ఎంసీ బృందం తనిఖీలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లించింది. దాంతో పాటు ఎన్‌ఎంసీ బృందం వచ్చేలోపు లోపాలన్నింటినీ సరిచేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కొత్త మెడికల్ కళాశాలల భవనాలు సైతం అందుబాటులోకి
జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, నర్సంపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌లో 2024 ఏడాదికి గాను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలకు సంబంధించి భవనాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. అయితే గత నెల నాలుగో వారంలో జాతీ య వైద్య మండలి సభ్యులు ఈ కాలేజీల సందర్శనకు వచ్చారు. బోధనా సిబ్బంది ఒక్కరూ లేకపోవండతో పాటు కొన్ని మెడికల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవని గుర్తించారు.
దీంతో ఎల్‌ఓపీ ఇచ్చేందుకు నిరాకరించారు. గత ఏడాది 9 వైద్య కళాశాలలను రాష్ట్రంలో ప్రారంభించిన నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా ఎన్‌ఎంసీ పర్యటనకు ముందే సిద్ధంగా ఉండాల్సిన అధికారులు ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మరోవైపు కొత్తగా 8 కళాశాలలు ఏర్పాటు చేస్తున్న సర్కారు సైతం అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు కల్పించ డంలో నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ఎన్‌ఎంసీ అనుమతులు నిరాకరించింది.
బోధనా సిబ్బంది నియామకానికి ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కళాశాలల్లో ఒక్కో కళాశాలకు 50 సీట్ల చొప్పున మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ 400 మంది విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు గాను ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో మెడికల్ కళాశాలకు 25 మంది ప్రొఫెసర్లు, 28 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 56 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తున్నట్లు ప్రకటించింది.
ఇలా ఒక్కో మెడికల్ కళాశాలకు 109 మంది బోధనా సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కొత్త మెడికల్ కళాశాలల బోధనా సిబ్బంది సమస్య తీరినట్లేనని అంతా భావిస్తున్నారు. అలాగే త్వరలోనే ఎన్‌ఎంసీ మరోసారి ఈ వైద్యకళాశాలలను సందర్శించే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ నెలాఖరున సందర్శన
నారాయణపేటలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయింది. అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. భోదనా సిబ్బంది నియామకం మాత్రం పూర్తి కాలేదు. గత నెల 24న ఎన్‌ఎంసీ బృందం మెడికల్ కళాశాల తనిఖీ చేసింది. అన్ని వసతులు, సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.
కానీ వారి పర్యటన సమయంలో బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల ఎల్‌ఓసీ రాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలకు బోధనా సిబ్బందిని కేటాయించిన నేపథ్యంలో ఆ సమస్య తీరింది. ఎన్‌ఎంసీ బృందం తనిఖీ కోసం తిరిగి ఫీజు చెల్లించి అప్పీలు చేశాం. ఈ నెలాఖరున గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ వారు తనిఖీలకు వచ్చే అవకాశం ఉంది.
డా. రామ్‌కిషన్, ప్రిన్సిపల్, నారాయణపేట మెడికల్ కళాశాల