భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 19 (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. వివరాలను ఎస్పీ రోహిత్‌రాజు వెల్లడించారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జీలోరుగడ్డ గ్రామానికి చెందిన మడివి అయిత అలియాస్ మంగు 2020 జూన్ నెలలో అదే రాష్ట్రానికి చెందిన హిడ్మా నాయకత్వంలోని ఫస్ట్ బెటాలియన్‌లో దళసభ్యుడిగా చేరాడు.
మావోయిస్టు పార్టీ బెటాలియన్ నాయకుల ఆదేశాల ప్రకారం ఇతర దళ సభ్యులతో కలిసి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నాడు. ఇటీవల బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తుండటంతో మావోయిస్టు పార్టీని వీడి పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవాలనుకుని నిర్ణయించుకొని, కొత్తగూడెం పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితుడై లొంగిపోయినట్లు వెల్లడించారు.