calender_icon.png 17 January, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుప్త నిధుల తవ్వకానికి వెళ్లి వ్యక్తి మృతి

14-08-2024 12:42:09 AM

  1. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా చిత్రీకరణ 
  2. కేసును ఛేదించిన పోలీసులు

కొడంగల్, ఆగస్టు 13: గుప్త నిధుల తవ్వకానికి వెళ్లిన ఓ వ్యక్తి బండరాయి మీద పడి మృతిచెందగా.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటనను కొడంగల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బొమ్మారాస్‌పేట మండల పరిధిలోని నాందర్‌పూర్ గ్రామ శివారులోని ఓ బ్రిడ్జి వద్ద నెల రోజుల క్రితం కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అనుమానాస్పద  మృతి కింద కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు మృతుడు దోమ మండలం దాదపూర్ గ్రామానికి చెందిన సత్యప్పగా గుర్తించారు.

మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.. మృతుడితో పాటు మరో ఎనిమిది మంది కలిసి మహబూబ్‌నగర్ జిల్లా సల్కర్ పేట గ్రామ శివారు గుట్టల్లో గుప్త నిధుల తవ్వకానికి వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బండరాయి మీద పడి సత్యప్ప చనిపోయినట్లు తెలిపారు. ఈ కేసు నుంచి మిగతా వారు తప్పించుకునేందుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయి నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే భాగంగానే మృతదేహాన్ని నాందర్‌పూర్ గ్రామ శివారులోని బ్రిడ్జి కింద పడేసినట్లు  తెలిపారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.