రాజేంద్రనగర్, సెప్టెంబర్ 15: బొలేరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హసన్ నగర్ ప్రాంతానికి చెందిన మోసిన్ మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఆరంఘర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శివరాంపల్లి వద్ద పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 266 సమీపంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చి బొలేరో వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మోసిన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్షతగా త్రుడిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుసత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.