పటాన్ చెరు (విజయక్రాంతి): జిన్నారం మండలం ఖాజీపల్లి పరిధిలో ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చెందిన చిట్యాల రవి(24) తన అన్న చిట్యాల రఘుతో కలిసి గత నాలుగు నెలలుగా జీఎంఆర్ కాలనీలో నివాసముంటు కూలీ పనులు చేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు కాలనీ సమీపంలో ఉన్న క్వారీ గుంతలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. రఘు బట్టలు ఉతుకుతుండగా రవి స్నానం కోసం నీటి గుంతలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రవీందర్ రెడ్డి సిబ్బందితో వచ్చి క్వారీ గుంతను పరిశీలించారు. లోతు ఎక్కువగా ఉండడంతో రవి మృతదేహం లభ్యం కాలేదు. గజ ఈతగాళ్లతో శవం కోసం గాలింపు చేపట్టారు. అన్న రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.