మహేశ్వరం (విజయక్రాంతి): ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం ఇన్స్‌స్పెక్టర్ కిసర నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... ఓల్డ్ మీర్‌పేట్ గ్రామ పరిధిలో సర్వోదయ నగర్ కాలనీకి చెందిన ముక్కెర్ల వెంకటేష్ (50), ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్యతో పాటు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రెండు నెలలుగా వెంకటేష్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో సరిగ్గా కలిసి ఉండటం లేదు. అయితే బుధవారం ఉదయం మీర్‌పేట్ మంత్రాల చెరువు సమీపంలో వాకింగ్‌కు వచ్చిన కొందరు వెంకటేష్ చెట్టుకు తాడుతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు సేకరించారు. అనంతరం చెట్టు నుంచి మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య వాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.