* మాలీవుడ్ లెజెండరీ సింగర్ జయచంద్రన్ ఇకలేరు
* 16 వేలకు పైగా పాటలు పాడిన దిగ్గజ గాయకుడు
* ఎన్నో ఎవర్ గ్రీన్ సాంగ్స్‌తో తెలుగులోనూ సుపరిచతం
సినిమా ప్రతినిధి, జనవరి 9 (విజయక్రాంతి): ‘రోజావే చిన్ని రోజావే..’ పాటతో పసి పాపల నుంచి పండుటాకుల వరకు అందరి హృదయాలను రంజింపజేసిన లెజెండరీ సింగర్ పీ జయచంద్రన్ (80) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ త్రిశ్శూర్‌లోని అమల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన జయచంద్రన్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
జయచంద్రన్.. ఆరు దశాబ్దాలకుపైగా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో 16 వేలకుపైగా పాటలు పాడారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, విద్యాసాగర్, కోటి తదితరుల సంగీత దర్శకత్వంలో ఎక్కువగా పాటలు పాడారాయన.
మరలి రాని లోకాలకేగిన మలయాళ ‘పాట’సారిని గుర్తు చేసుకుంటూ తెలుగు చిత్రసీమ బాధాతప్త హృదయంతో మనసులో నివాళి అర్పిస్తోంది. ఆయన మరణ వార్త తెలిసిన పలు సినీ ఇండస్ట్రీల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్..
జయచంద్రన్ తెలుగులో పాడిన పాటలెన్నో సంగీత ప్రియుల హృదయాల్లో ఇప్పటి కీ మార్మోగుతూనే ఉన్నాయి. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘సుస్వాగతం’ సినిమాలో ‘హ్యాపీ హ్యపీ బర్త్‌డేలు మళ్లీ మళ్లీ చేసుకోగ..’ అంటూ సాగే పాట ఆయన పాడిందే. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సూర్యవంశం’ చిత్రం కోసం ఆయన పాడిన పాటైతే ఎవర్ గ్రీన్. ఆ సినిమాలోని ‘రోజావే చిన్ని రోజావే..’ అన్న పల్లవి తో ప్రారంభమయ్యే పాట ఎప్పటికీ చంటి పిల్లల నుం చి పండుటాకుల వరకు అందరికీ వినసొంపైనదే అనడం అతిశయోక్తి కాదు.
తరుణ్ హీరోగా వచ్చిన ‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది..’ పాట అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. తెలుగులో ఆయన పాడిన చివరి పాట ‘నా చెల్లి చంద్రమ్మ’ (ఊరు మనదిరా) 2002 సంవత్సరంలో విడుదలైంది.
పురస్కారాలు..
1986లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా నేషనల్ అవార్డు (శ్రీ నారాయణ గురు సినిమాలోని పాటకు), 5 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు కూడా జయచంద్రన్‌ను వరించాయి. గాయకుడిగానే కాకుండా తెరపై కూడా జయచంద్రన్ కనిపించారు. మలయాళ సినిమాలు ‘నఖక్ష తంగళ్’, ‘ట్రివేండ్రం లాడ్జ్’ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు.
ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్‌కు కేరళ, తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతోపాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. 1965లో ‘కుంజాలి మరక్కర్’ చిత్రంలో పీ భాస్కర్ రాసిన ‘ఒరు ముల్లా పూ మాలయుమాయ్’ అనే పాటను చిదంబరనాథ్ సంగీత దర్శకత్వంలో పాడారు.
ఈ సినిమా విడుదలకు ముందు మద్రాసులో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో జయచంద్రన్ పాడిన రెండు పాటలు విన్న దర్శకుడు ఏ విన్సెంట్ సిఫారసు మేరకు సంగీత దర్శకుడు జీ దేవరాజన్ ‘కలితోజన్’ చిత్రంలో పీ భాస్కర్ రాసిన ‘మంజలయిల్ ముంగి తోర్తి’ అనే పాటను పాడించారు. 1967లో విడుదలైన ఈ చిత్రంలోని పా టకు మంచి ఆదరణ లభించింది.