calender_icon.png 17 January, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెరపై వికసించిన కమలం

13-01-2025 12:00:00 AM

ఆమె.. మూడు దశాబ్దాల పాటు చిత్రరంగాన్ని శాసించిన మహానటి. నటీమణుల్లో అత్యధిక పారితోషికాన్ని స్వీకరించిన నాట్యమయూరి. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గొప్ప భరతనాట్య కళాకారిణి. తల్లి ప్రేరణతో నాట్యం మీద మోజు పెంచుకుని.. చదువునే త్యాగం చేసిన నటి హేమామాలిని. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డ్రీమ్ గర్ల్ కూడా.. 

1963లో తమిళ సినిమా ‘ఇదు సతియం’ సినిమాలో మొదటిసారిగా వెండితెరపై తళుక్కుమన్న బంగారు భామ హేమ. “పింజారె తేరిక్కి చేరికట్టి’ పాటలో గ్రూప్ డ్యాన్స్‌లో మొదటిసారి మెరిసింది. అదే ఆమె అరంగ్రేటం అని చెప్పవచ్చు. పెద్ద టీ ఎస్టేట్ లొకేషన్‌లో కనిపించిన ఈ సుందరాంగి మొదటి ఫ్రేమ్‌లోనే తన సొట్టబుగ్గలతో అందర్ని ఆకట్టుకుంది.

అఖిల భారత స్థాయిలో డ్రీమ్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హేమమాలిని తెలుగులో రెండు చిత్రాలలో నటించగా అవి రెండూ ఎన్టీఆర్ చిత్రాలే కావడం విశేషం. ఆమె తొలి తెలుగు సినిమా ‘పాండవ వనవాసం’. మద్రాసుకు చెందిన బి.అనంతస్వామి అనే లాయర్ నిర్మాతగా మారి హిందీలో ‘సప్నోంకా సౌదాగర్’ అనే సినిమా ప్లాన్ చేశారు. ఆ మూవీలో రాజ్‌కపూర్ సరసన నటించింది. ఆ తర్వాత కాలంలో ‘జహా ప్యార్ మిలే’, ‘వారిస్’, ‘ఆంసూ అవుర్ ముస్కాన్’ సినిమాలు హిట్ కాకపోయినా బాగా ఆడాయి. 

మనసుపడ్డ హీరోలు..

1970వ సంవత్సరం వచ్చిన ‘జానీ మేరా నామ్’ సూపర్ హిట్‌గా నిలిచి ఆమెను డ్రీమ్‌గర్ల్‌గా మార్చి వేసింది. 1971లో వచ్చిన ‘అందాజ్’, ‘లాల్ పత్తర్’, ‘తేరే మేరే సప్నే’ సినిమాలు విజయవంతం కావడం వల్ల హేమ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1972లో ద్విపాత్రాభినయం చేసిన ‘సీతా అవుర్ గీత’ సినిమా ఆమెను శిఖరాగ్రంపై కూర్చోబెట్టింది. ధర్మేంద్ర, జితేంద్ర, సంజీవ్ కుమార్ వంటి సెలబ్రిటీలు హేమమాలినిపై మనసు పడ్డారు.

అయితే అప్పటికే వివాహితుడైనా ధర్మేంద్రనే వివాహమాడారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వారు ఈషా, అహానాలు.. ప్రస్తుతం ఇద్దరు జీవితంలో స్థిరపడ్డారు. ధర్మేంద్రతో హేమమాలిని 35 సినిమాలు చేస్తే అందులో 20 సూపర్ హిట్లే!. ‘షరాఫత్’, ‘తుం హసీన్ మైన జవాన్’, ‘రాజా జానీ’, ‘నయా జమానా’ సినిమాలు ఇందుకు సాక్ష్యాలు. శశికపూర్‌తో చేసిన పది సినిమాల్లో ఐదు హిట్లు. రాజేష్ ఖన్నాతో ‘ప్రేమ్ నగర్’, ‘బందిష్’, ‘కుద్రత్’, ‘దర్డ్’, ‘హమ్‌దోనో’ వంటి పది బాక్సాఫీస్ హిట్లున్నాయి. ౧౯౭౫లో విడుదలైన షోలే సినిమాలో బసంతి పాత్రకు జీవం పోసింది హేమ.  

పెళ్లున తర్వాత..

హేమమాలిని పెళ్లున తర్వాత క్యారెక్టర్ రోల్స్‌నే ఎన్నుకున్నది ‘క్రాంతి’, ‘నసీబ్’, ‘సత్తే పె సత్తా’, ‘సామ్రాట్’, ‘రజియా సుల్తానా’ కూడా హిట్లే. బాలచందర్ తమిళ సినిమా ‘అపూర్వ రాగంగల్’కు రీమేక్ చిత్రం ‘ఏక్ నయీ పహేలీ’లో శ్రీవిద్య పాత్రను ఎంతో హుందాగా నటించి అందరి అభిమానం చూరగొంది.  తెలుగులో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బాలకృష్ణ తల్లిగా హేమ నటించింది. ‘సూపర్’ , ‘ఉమెన్ ఆఫ్ ఇండియా’ వంటి టెలివిజన్ సీరియళ్లకు దర్శకత్వం వహించింది. 

పురస్కారాలు!

హేమమాలిని తన కెరీర్‌లో దాదాపు 150 సినిమాల్లో నటించారు. 1999లో ఆమెకు ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం. అలాగే భారత ప్రభుత్వం హేమకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు.

హేమ  తమిళనాడు ఊటీకి దగ్గరలో ఉన్న అమ్మన్‌కుడిలో రామానుజ చక్రవర్తి, జయా చక్రవర్తిలకు 1948లో జన్మించింది. తల్లి జయకు సినీరంగంతో పరిచయాలు ఎక్కువ. మద్రాసులో ఉండటం వల్ల ఆంధ్ర మహిళ సభలో హేమ చదువుకుంది. కానీ నాట్యకళ మీద ఉన్న మక్కువతో పదో తరగతిలోనే చదువుకు స్వస్తి పలికింది.