- రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
- సొంతూళ్లకు పయనమైన నగరవాసులు
- రాష్ట్ర వ్యాప్తంగా 6,432 బస్సుల ప్రత్యేక బస్సులు
- కిటకిటలాడిన మెట్రో సర్వీసులు
- టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (విజయక్రాంతి): సంక్రాం తి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు పెద్దసంఖ్యలో సొంతూళ్లకు పయనం అయ్యారు. దీంతో శనివారం ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం వరకూ మెట్రో రైళ్లు కిటకిటలాడాయి.
నగరం నుంచి బయటకి వెళ్లే పాయింట్ల వద్ద ఎక్కడ చూసినా బస్సులు, కార్లే కనిపించాయి. ఆ ప్రాంతాలలో వాహనాల హారన్ల మోతలు దద్దరిల్లాయి. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో ప్రజలు వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు టీజీఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
అందులో హైదరాబాద్ సిటీ జోన్ నుంచి గతేడాది 2,567 బస్సులను ఆర్టీసీ నడపగా, ఈ ఏడాది 3,008 బస్సులను కేటాయించారు. ఈ బస్సులను ఈ నెల 7 నుంచే ఆర్టీసీ అందుబాటులో ఉంచగా .. 10 నుంచి 13 వరకూ నగరం నుంచి అత్యధిక సంఖ్యలో ప్రయాణీకులు తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ సిటీజోన్ పరిధిలో శుక్రవారం 406 బస్సులు వెళ్లగా.. శనివారం 164 రిజర్వేషన్ బస్సులు, 1,243 ఇతర బస్సులు నగరం నుంచి బయలుదేరాయి. వీటి ద్వారా (కేవలం ఆర్టీసీ బస్సుల) దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరినట్టుగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రాంతాల రైల్వే స్టేషన్ల నుంచి లక్షలాది మంది తమ ఊర్లకు బయలు దేరారు. ఇక ప్రైవేటు ట్రావెల్స్ వాహనాల ద్వారా వేలాది మంది నగరవాసులు సొంతూళ్లకు వెళ్లడానికి క్యూ కట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఛార్జీలు భారీగ ఉన్నా.. రద్దీలో అసౌకర్యంగా వెళ్లడం ఎందుకని, అదనపు ఛార్జీలను సైతం ప్రయాణీకులు పట్టించుకోవడం లేదు.
హైదరాబాద్ మహానగరం నుంచి సంక్రాంతి పండుగకు ప్రతి ఏడాది ప్రజలు లక్షలాదిగా తరలిపోతుంటారు. అయితే, గతేడాది కంటే ఈ ఏడాది సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరుగుతున్నట్టుగా ఆర్టీసీ భావిస్తున్నది. జేబీఎస్, ఎంజీబీఎస్ ప్రధాన బస్టాండ్‌లతో పాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంది.
టికెట్ కౌంటర్ల వద్ద టికెట్లకోసం భారీగా క్యూకట్టారు. రైల్వే శాఖకు కూడా ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించి, నడుపుతున్నది. విజయవాడ, కర్నూలు, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు ప్రజలు వెళ్లేందుకు అవసరమైతే మరిన్ని బస్సులను కేటాయించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
మెట్రోల్లో కిటకిట
విద్యాసంస్థలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు రావడం, ఉద్యోగులకు వారాంతం కలిసి రావడంతో హైదరాబాద్‌లోని తెలుగు రాష్ట్రాల ప్రజలు పల్లెకు పయనమయ్యారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఉప్పల్, ఎల్బీనగర్‌కు వెళ్లే వారు మెట్రోలను ఆశ్రయించారు. దీంతో మెట్రో రైళ్లు శనివారం ప్రయాణికులతో కిటకిట లాడాయి.
ప్రధానంగా ఎంజీబీఎస్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లకు ఎక్కువ మంది ప్రయాణించారు. ఉప్పల్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, జేబీఎస్, ఎంజీబీఎస్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెల కొంది. హైదరాబాద్ మెట్రోల్లో గతేడాది ఒకే రో జు అత్యధికంగా 5.65లక్షల మంది ప్రయాణించారు.
ప్రస్తుతం ప్రతీ రోజు మెట్రోల్లో దాదాపు 5లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. శుక్రవారం మాత్రం 5.45లక్షల మంది ప్రయాణిం చినట్లు తెలుస్తోంది. శనివారం అంతకుమించి ప్రయాణించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం, సోమవారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్
నల్లగొండ, (విజయక్రాంతి): హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై శనివారం భారీగా ట్రాఫిక్ నెలకొంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రావాసులు స్వగ్రామాలకు పయణమవడంతో విజయవాడ వైపు వాహనాలు వరుసకట్టాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ కాస్త నెమ్మదించింది.
ఫాస్టాగ్ ఉన్నా ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రావడంతో, వాటిని పంపేందుకు సమయం పట్టింది. విజయవాడ వైపు నిత్యం 30 నుంచి 40 వేల వాహనాలు వెళ్తుండగా శనివారం 80 వేలకుపైగా వెళ్లాయి. నార్కెట్‌పల్లి- అద్దంకి రహదారిపై మాడుగులపల్లి టోల్‌గేట్ వద్ద ఆంధ్రావైపు వెళ్లే వాహనాల కోసం రెండు టోల్‌బూత్‌లు అదనంగా తెరిచారు.
చౌటుప్పల్‌లో హైవే ఇరువైపులా డ్రైనేజీ పనులు జరుగుతుండడంతో సర్వీస్ రోడ్లపైకి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రద్దీ నెలకొంది. రాచకొండ కమిషనరేట్ రోడ్డు భద్రతా డీసీపీ మల్లారెడ్డి, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ ట్రాఫిక్ రద్దీ పరిశీలించారు.