మహిళా కానిస్టేబుల్ దుర్మరణం
కాబోయే భర్తతో కలిసి సాగర్‌కు వస్తూ మృత్యు ఒడిలోకి
నల్లగొండ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. కాబోయే భర్తతో కలిసి నాగార్జునసాగర్ చూసేందుకు కారులో వస్తుండగా లారీ రూపంలో మృతువు ఆమెను కబలించింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల గ్రామానికి చెందిన శ్రావణి(28) జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆమెకు వివాహం నిశ్చయమైంది.
కాబోయే భర్తతో కలిసి బుధవారం నాగార్జునసాగర్‌ను తిలకించేందుకు కారులో బయలుదేరారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాగార్జునసాగర్ శివారులోని దయ్యాలగండి వద్దకు రాగానే లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. ఓ కారు లారీ కింది భాగంలోకి దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జునసాగర్ సీఐ బీసన్న తెలిపారు.