మంటలు ఆర్పిన అగ్నిమాపక శాఖ అధికారులు
మరోసారి మంటలు చెలరేగడంపై అనుమానాలు...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో లారీ కంటైనర్ దగ్ధమైన ఘటన కలకలం రేపుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న టేక్రియాల్ బైపాస్ చౌరస్తా 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఎలక్ట్రిక్ స్క్రాప్స్ లోడ్ తో నాగపూర్ వైపు వెళ్తుండగా కామారెడ్డి జిల్లా టేక్రియాల్ వద్ద ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదు. లారీ కంటైనర్ లో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు నేషనల్ హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న కామారెడ్డి అగ్నిమాపక శాఖ సిబ్బంది అధికారులు కంటైనర్ లో మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
దగ్ధమైన కంటైనర్ను పక్కనున్న పెట్రోల్ బంక్ పక్కనే ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశారు. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో కంటైనర్ లో మళ్లీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కంటెయినర్ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ అధికారులు చేరుకుని ముందస్తుగా పెట్రోల్ బంక్ సర్వీసులు నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. అయితే మంటలను పూర్తిగా అర్పివేసినా మళ్లీ చెలరేగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండుసార్లు మంటలు చెలరేగడంపై అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు నాలుగు లక్షల మెటీరియల్ ఈ ప్రమాదంలో దగ్ధమైనట్లు భావిస్తున్నారు. లారీ కంటైనర్ డ్రైవర్ కు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు.