05-04-2025 08:21:31 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కొద్దిపాటి ఒత్తిడే విద్యార్థుల విజయానికి దిక్సూచిగా పనిచేస్తుందని జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ రమణ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆయన శనివారం విద్యార్థులకు మానసిక ఒత్తిడి పై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మానసికంగా బాగుంటేనే శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు ఎటువంటి వ్యాధినైనా జయించవచ్చని సూచించారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో పాఠ్యాంశాలను సక్రమంగా అభ్యాసం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు మానసికంగా బాగుంటే ఎటువంటి లక్ష్యాన్ని అయినా అధిగమించవచ్చని సూచించారు.
పరీక్షా కాలంలో విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా సరైన నిద్ర తీసుకొని సరైన ఆహారం భుజించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి పరీక్షలకు ముందు భయపడతారని ఎలాంటి భయం లేకుండా పాఠ్యాంశాలు సక్రమంగా చదువుకున్నట్లయితేనే పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలుగుతారని తెలిపారు తీవ్ర మానసిక సమస్యలు ఎదురవుతున్న విద్యార్థులు కచ్చితంగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించి చికిత్సలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వర్కర్ డాక్టర్ రాహుల్ కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ సురేఖ సిబ్బంది శ్యామల, ఉమారాణి, పంచశీల, సంధ్య తదితరులు పాల్గొన్నారు.