మాళవిక మోహనన్ నేడు (ఆదివారం) పుట్టిన రోజు జరుపుకోనుంది. ఇప్పటికే పలు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. ఈమె నటించిన ఇతర భాషా చిత్రాలు తెలుగులో అనువాదమయ్యాయి. ఈ చిన్నది త్వరలో ప్రభాస్ సరసన ‘రాజాసాబ్’తో పూర్తి తెలుగు చిత్రంలో నటించనుంది. కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ మాళవికనే హీరోయిన్. ఈ భామ శుక్రవారం సెట్‌లో అడుగుపెట్టినట్టు మేకర్స్ ప్రకటించారు కూడా. ఇక విక్రమ్ నటించగా, ఈ నెల 15న విడుదల విడుదలకు సిద్ధంగా ఉన్న ‘తంగలాన్’లో ఓ కీలక పాత్రలో కనిపించనుందీ భామ. ఈ బిజీ షెడ్యూల్‌లోనూ ఎప్పటిలాగే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇటీవల ముచ్చటించింది.
‘ఎలాంటి జానర్‌లో నటించాలని ఉంది?’ అంటూ ఓ అభిమాని అడగ్గా.. ‘నాకు యాక్షన్ డ్రామాలంటే ఇష్టం. భవిష్యత్తులో ఓ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో నటించాలనుంది. ప్రతినాయిక ఛాయలున్న రోల్స్‌లో కనిపించడంపై ఆసక్తి కనబరుస్తాను’ అంటూ బదులిచ్చింది. స్టార్ హీరో విక్రమ్‌తో కలిసి త్వరలో ‘తంగలాన్’లో డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్న ఈ గ్లామరస్ హీరోయిన్ ఆయన గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలిపింది. “విక్రమ్‌ను తొలిసారి కలిసినప్పుడు భయంగా అనిపించింది. ఆయనతో యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. కానీ ఆ విషయంలో విక్రమ్ నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. ఆయన లేకుండా ‘తంగలాన్’ ప్రయాణాన్ని ఊహించుకోలేను. ఈ చిత్రం కోసం నటించిన తర్వాత ఆయనపై మరింత గౌరవం పెరిగింది” అని చెప్పుకొచ్చింది.