calender_icon.png 12 January, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంచెం కష్టం.. కొంచెం సులువు!

19-07-2024 12:49:39 AM

  1. డీఎస్సీ పేపర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు
  2.  82% మంది హాజరు

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): డీఎస్సీ పరీక్ష మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు 82 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. మొత్తం 20 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు ఆయనను గురువారం విలేకరులతో చెప్పారు. 

ఉదయం పేపర్ యావరేజ్..

మొదటి సెషన్‌లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్) తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షలు జరిగాయి. అయితే ఈ పేపర్‌లు కొంచెం సుల భంగా, కొంచెం కఠినంగా వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. కరెంట్ అఫైర్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల నుంచి ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. తెలంగాణ పథకాలకు సంబంధించిన ప్రశ్నలను పెద్దగా అడగ లేదు. జనరల్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలను అడిగారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-2020, ఎన్ ఈపీ-1986పై ప్రశ్నలు అడిగారు. ఎన్‌సీఈఆర్టీ విధులు, విద్యాహక్కు చట్టం-2009, ఆవిష్కరణ సిద్ధాంతం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. ఆయా సబ్జెక్టుల పరిధిలోని ఎక్కువగా 8,9, 10వ తరగతి స్థాయిలో ప్రశ్నల సరళి ఉందని, కొన్ని ప్రశ్నల సరళి ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఉందన్నారు.

మధ్యాహ్నం పేపర్ నార్మల్‌గానే

మధ్యాహ్నం సెషన్‌లో పీఈటీ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ మీడియం అభ్యర్థులకు పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కొన్ని ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు తెలిపారు. ఉపాధ్యాయ ఎంపికలో అర్హత పరీక్ష టెట్‌పై ఒక ప్రశ్న, భారత దేశంలో అతిఎత్తున ప్రాజెక్టుల గురించి అడిగారు. విద్యాహక్కు చట్టం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ-2020), ఈనెలలో జరిగే ఒలంపిక్స్‌పై ప్రశ్నలు అడిగారు. అమ్మ ఆదర్శ కమిటీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతిపై ప్రశ్నలు అడిగారని అభ్యర్థులు తెలిపారు. ఇదిలా ఉంటే శుక్రవారం మొదటి, రెండవ సెషన్‌లో ఎస్జీటీ తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఓ అభ్యర్థి హల్‌చల్..

మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ అభ్యర్థికి ఈనెల 24న పరీక్ష ఉంది. అయితే తాను ఓ నకిలీ హాల్‌టికెట్‌తో హైదరాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రానికి వచ్చి తనకు లోనికి అనుమతించాలని హల్‌చల్ చేసినట్లు అధికారులు తెలిపారు. అనుమానం వచ్చిన అధికారులు అతని హాల్‌టికెట్‌ను స్కాన్ చేయగా అది నకిలీదని, పైగా అతనికి ఈనెల 24న పరీక్ష ఉందని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని విచారిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అతని వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఒక్క సంఘటన మినహా 56 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.