31-03-2025 01:03:34 AM
90.41 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి
గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ
సూర్యాపేట, మార్చి 30 (విజయక్రాంతి): పేదల ఆకలి తీర్చేందుకే తమ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకా రం చుట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆదివారం ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు.
పోరాటాల ఖిల్లా నల్లగొండ జిల్లా అని, ఇక్కడి మట్టిలోనే పోరాట పటి మ ఉందని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డిని జిల్లా ప్రజలు అత్యధిక మెజా ర్టీతో పార్లమెంట్‌కు పంపించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో రఘువీర్‌రెడ్డిని ఎన్నికల్లో గెలిపించారన్నారు.
నిరుపేదలకు కూడు.. గూడు అందివ్వాలన్నది నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాంక్ష అని, ఆమె స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం అందజేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు రూ.1కే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిందని, కానీ.. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ ప్రభుత్వం రూ.2కు కిలో బియ్యం పేరిట ఆ పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు.
ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్రంలో 90.41 లక్షల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపి ణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే జిల్లా నల్లగొండ అని, ఈ జిల్లా రైతులకే అత్యధి కంగా బోనస్, రైతు భరోసా వచ్చిందని వెల్లడించారు. ఇక్కడి రైతులు ఎంతో చైతన్యవంతులని కొనియాడారు. గత ప్రభు త్వం హయాంలో రూ.20 వేల కోట్ల విలువైన వడ్లను మిల్లర్లు దాచి పెట్టారని మండిపడ్డారు.
రేషన్‌కార్డుదారుల నుంచి దొడ్డు బియ్యం సేకరించి, మళ్లీ వాటిని రీసైక్లింగ్ చేసి దోచుకున్నారని ధ్వజమెత్తారు. అలా మిల్లర్ల మాఫియా ఏటా రూ.10 వేల కోట్లు మిల్లర్లు సొమ్ము చేసుకున్నారన్నారు. ఆ దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చేందుకే యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తెచ్చిందని గుర్తుచేశారు.
వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు పేదల పాట్లు పట్టలే..
‘పేదలకు సన్న బియ్యం అందించాలని 10 వేల పుస్తకాలు చదివిన గత సీఎం కేసీఆర్‌కు తోచలే. 10 ఏండ్ల పాలనలో ఏనాడూ పేదల కోసం ఆలోచన చేయలె. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని రైతులను బెదిరించిండు. ఇప్పుడాయన ఫాంహౌస్‌లో వరి పండిస్తున్నడు’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
నల్లగొండ రైతుల కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్ పనులు ప్రారంభించారని, మొత్తం 44 కిలోమీటర్ల సొరంగం పనుల్లో ఇప్పటివరకు 34 కిల్లోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం పదేండ్లు పాలించి కూడా 10 కిలోమీటర్ల మేర అయినా పని పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం వచ్చే వరకూ సొరంగం పనులు కదల్లేదని, పడావ్ పడిన ప్రాజెక్ట్‌లను తాము పునద్ధరిస్తున్నామని తెలిపారు.
రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడెళ్లలోనే కుంగిందని, రైతుల పాపం ఊరేకే పోదన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో తాము చేయగలిగినన్ని పనులు చేపట్టామని, ముం దుకు అనుకున్న హామీలన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కొంటున్నామని, సన్నాలకు క్వింటాకురూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని తెలిపారు. 15 నెలల్లో రైతుల ఖాతాల్లో రూ.5 వేల కోట్ల రైతు భరోసా జమ చేశామని వివరించారు.
రూ.20 వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని వెల్లడించారు. 2006లో తాను జడ్పీటీసీగా రాజకీ య ప్రయాణం మొదలు పెట్టానని, ఇప్పు డు ముఖ్యమంత్రిని కూడా అయ్యానని, సంకల్ప బలం ఉంటే ఎవరు ఏదైనా సాధించవచ్చని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి కోరిక మేరకు హుజూర్‌నగర్‌కు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తామని, ఎమ్మెల్యేల కోరిక మేరకు మిర్యాలగూడెం, దేవరకొండకు యంగ్ ఇండియా గురుకుల పాఠశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం అంతకు ముందు హుజూర్‌గర్ నియోజకవర్గ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
అద్భుతమైన పథకానికి శ్రీకారం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సన్న బియ్యం పంపిణీ అద్భుతమైన పథకమని, పేదల కడుపు నింపేందుకే తమ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. ఇంత పథకం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ నుంచి ప్రారంభం కావడం ఆనందాన్నిచ్చిందన్నారు.
రేషన్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, లబ్ధిదారులు వాటిని తిరిగి అమ్మేస్తున్నారని, అదే సన్న బియ్యం అందజేస్తే భేషుగ్గా తింటారనే ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని తాను గతంలోనూ పార్లమెంట్‌లో ప్రస్తావించానని, కానీ.. తన అభ్యర్థనను ఏ ప్రభు త్వమూ పట్టించుకోలేదన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల ఉన్న చోటే కొత్త రేషన్‌కార్డులు ఇచ్చిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. తెల్ల రేషన్ కార్డు స్థానంలో మూడు రంగుల కార్డు, గులాబీ కార్డు స్థానంలో గ్రీన్ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.