calender_icon.png 11 October, 2024 | 8:55 PM

ఒక సింహస్వప్నం

09-10-2024 12:00:00 AM

నేడు చేగువేరా వర్ధంతి :

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా, యువతకు ఆరాధ్యదైవంగా నేటికీ వారి దుస్తులపై, వాహనాలపై ఆయన చిత్రం ధరిస్తూ నిరంతరం ప్రేరణ పొందే సామ్యవాదానికి ప్రతీక, సగటు ప్రజల సోషలిస్టు చేగువేరా. కేవలం 39 సంవత్సరాలు జీవించి, అసామాన్య అమెరికాకు, పెట్టుబడీదారీ దేశాలకు, వారు ప్రోత్సహించే నియంతలకు సిం హస్వప్నమై చరమగీతంపాడిన విప్లవ జ్యోతి చేగువేరా.

1928 జూన్ 14న ఐదవ సంతానంగా అర్జెంటీనా దేశంలో రొసారియాలో వామపక్ష భావజాలం గల కుటుంబంలో జన్మించారు. తన తండ్రి కోరుకున్నట్లుగా, ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సంపాదించుకున్నారు. వైద్య చదువు చదివే రోజుల్లోనే మోటార్ సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండం అంతా ప్రయాణించి, ఆనాటి సమాజంలో ఉన్న ధనిక, పేద అంతరాలు ప్రత్యక్షంగా చూసి చలించారు.

పేదల కష్టాలు కడతేర్చడానికి, సామ్రాజ్యవాదంపై విజయం సాధించడానికి హింసా త్మక విప్లవం ఒకటే మార్గం అని తలచి, పోరుబాట పట్టిన ఎర్నెస్ట్ చేగువేరా నేటి ప్రపం చంలోని సామ్యవాద భావాలు కలవారికి చైతన్య దీపం. 1954లో గౌటిమాలలో ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో పనిచేసారు. అయి తే అమెరికా ఆ ప్రభుత్వాన్ని కూలదోయడం తో మెక్సికో చేరుకున్నారు.

ఆ సమయంలో తన సహచరులతో మెక్సికో చేరుకున్న ఫెడరల్ కాస్ట్రోతో పరిచయం అయింది. క్యూ బాలో అమెరికా ప్రోత్సాహిస్తున్న నియంత బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాస్ట్రో పోరాటానికి మద్దతుగా ఆయనతో అడుగులు వేసి, 1956-59 మధ్య జరిగిన పోరా టంలో బటిస్టాను గద్దె దింపారు. ఫెడరల్ కాస్ట్రో అధ్యక్షతన ఏర్పడిన సామ్యవాద ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, బ్యాంకు అధ్య క్షుడుగా సేవలు అందించారు.

అనేక దేశాలు పర్యటిస్తూ, భారతదేశాన్ని కూడా 1959లో సందర్శించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చారు. ఇటువంటి సా మ్రాజ్య వాద దేశాలపై ఉక్కుపాదం మోపాలనే చేగువేరా నిరంతరం అవిరళ కృషి చేశారు. గొరిల్లా శిక్షణ ఆనాటి పోరాట యోధులకు నేర్పి, ప్రజా కంటకుల పాలిట సింహస్వప్నమై కదిలాడిన కామ్రేడ్.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో క్యూబా తరఫున పాల్గొని, దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షతపై, లాటిన్ అమెరికాలోని వివిధ దేశాల నియంతల పాలనపై, పెట్టుబడిదారీ దేశాల ప్రభావాన్ని గొంతెత్తి చాటాడు.. వేలెత్తి చూపాడు. క్యూబా సామ్యవాద దేశంగా మారటానికి అవిరళ కృషి చేశారు. రైతాంగ విప్లవాల నిర్మాణానికి దోహదం చేసారు.

కాస్ట్రో తరువాత క్యూబా లో అంతటి పట్టు కలిగిన బలమైన నేతగా ఉన్న సమయంలో ఇతర పేద దేశాల్లో విప్లవాన్ని వ్యాప్తి చేయడానికి, కాస్ట్రో మాటను సైతం లెక్కచేయ కుండా క్యూబాను వదిలి కాంగో వెళ్లారు. తరువాత బొలీవియా చేరి అక్కడ ప్రజాపోరాటాల్లో ఉన్న సమయంలో 1967 అక్టోబర్ 9న బొలీవియా సైన్యంచేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక తారతమ్యాల విప్లవానికి తిరుగుబాటు చిహ్నం చేగువేరా. 

 ఐ.ప్రసాదరావు