- సిండికేట్‌గా మారి ధర తగ్గిస్తున్న వ్యాపారులు
- జెండా పాట క్వింటాలుకు రూ.౧౬ వేలు
- రూ.10 వేల నుంచి రూ.12 వేలే చెల్లిస్తున్న వైనం
- ఖమ్మం మార్కెట్ అధికారుల కనుసన్నల్లోనే అంతా..
ఖమ్మం, జనవరి 8 (విజయక్రాంతి): ఖమ్మం మిర్చి మార్కెట్‌లో ధరల దగా జరుగుతుండటంతో అన్నదాతలు నిండా మునుగుతున్నారు. అధికారుల కనుసన్నల్లోనే వ్యాపారులు కుమ్కక్కుకావడంతో గిట్టుబాటు ధర దక్కక రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
ఖమ్మం మిర్చి మార్కెట్‌కు ఖమ్మం నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు మిర్చిని తీసుకువస్తారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఖమ్మం మార్కెట్‌కు సరుకు తీసుకొస్తారు. మార్కెట్‌లో జెండా పాట క్వింటాలుకు రూ.౧౬ వేలు ఉండగా వ్యాపారులు ఏవేవో సాకులు చెప్పి క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.12 వేలే చెల్లిస్తున్నారు.
కుంటిసాకులతో ధర తగ్గింపు
ఎకరాకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడులు పెడుతున్న రైతులకు కూలీలు ఖర్చు, ట్రాన్స్‌ఫోర్ట్ ఖర్చు అదనం. అయితే వ్యాపారులు సిండికేటుగా మారి మార్కెట్‌లో మిర్చిలో కుంటి సాకులు చూపి ధర అమాంతం తగ్గిస్తున్నారు. నాణ్యత, తేమ సాకులు చూపి ధర తగ్గిస్తుండటంతో పెట్టుబడి కూడా వెళ్లని పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెండా పాట ప్రకారం ధర కొనసాగించకుండా ధర తగ్గించి రైతుల నోట్లో వ్యాపారులు మట్టి కొడుతున్నారు.
59 వేల ఎకరాల్లో మిర్చి సాగు
ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతు పరిస్థితి ఆరంభంలోనే అదోగతి పాలవుతున్నది. ఒక వైపు కలెక్టర్ మిర్చి విక్రయాలు సజావుగా జరిగేలా రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని చెబుతున్నా వ్యాపారుల తలకెక్కడం లేదు. జిల్లాలో 59 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు.
ఈసారి దాదాపు లక్షా 18 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కారణాల వల్లనే ధర తగ్గిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెపుతున్నారు. రైతులు మాత్రం వ్యాపారులే సిండికేట్‌గా ఏర్పడి ధరను తగ్గించేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రూ.12 వేల నుంచి రూ.14 వేలే..
బుధవారం ఖమ్మం మిర్చి మార్కెట్‌కు తేజ రకానికి సంబంధించి 630 మంది రైతులు 8,613 బస్తాలను తీసుకువచ్చారు. తాలు రకం 612 బస్తాలు, ఏసీ రెడ్ మిర్చి రకం 3,988 బస్తాలు వచ్చింది. తేజ రకం క్వింటాల్ రూ.16 వేలు పలికిందని మార్కెట్ అధికారులు అంటున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఆ రేటు రాలేదంటున్నారు. జెండా పాట రూ.16 వేలు ఉంటే కొనేటప్పటికీ నాణ్యత, తేమ, తాలు శాతం చెప్పి రూ.12 వేల నుంచి రూ.14 వేలకు కొన్నారు. అధికారులు జోక్యం చేసుకుని, కనీసం జెండా పాట రేటుకైనా కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పాలకవర్గం నియామకం ఎన్నడో
ఏడాది కాలంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నూతన పాలకవర్గం నియమించలేదు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పాలకవర్గాన్ని నియమించకపోవడంతో రైతుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు. మంత్రి స్పందించి మార్కెట్‌కు నూతన పాలకవర్గాన్ని నియమించాలని రైతులు కోరుతున్నారు.
దగాకు అడ్డూ అదుపు లేకుండా ఉంది
పాలకవర్గం లేక, గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఖమ్మం మార్కెట్‌లో దోపిడీకి గురవుతున్నారు. కమీషన్ వ్యాపారులు, అధికారుల కనసన్నల్లోనే వ్యాపారులు సిండికేట్‌గా మారి దోపిడీ చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఖమ్మంలోనే వ్యవసాయ మంత్రి ఉన్నా రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంత్రి తుమ్మల జోక్యం చేసుకుని, క్వింటాకు రూ.20 వేలు గిట్టుబాటు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలి
మద్దినేని రమేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ఖమ్మం
ఇలా అయితే బతికేదెలా?
మార్కెట్‌లో నాణ్యత పేరుతో దారుణంగా ధర తగ్గించి కొంటున్నారు. ఇలా అయితే మేమెలా బతకాలి. ధర చూసి మనోధైర్యం కోల్పోవాల్సి వస్తుంది. ఎకరానికి రెండు లక్షల దాకా పెట్టుబడి పెట్టి, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు రూ.3 వేలు పెట్టుకుని మార్కెట్‌కు వస్తే వ్యాపారులు కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదు. బుధవారం 15 క్వింటాళ్ల మిర్చిని తీసుకుని వస్తే కేవలం రూ.13 వేల ధర కూడా రాలేదు.
బాణోత్ మోతీలాల్,
చింతలపాలెం, సూర్యాపేట జిల్లా