ప్రముఖ రాజకీయ వేత్త, వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత వామపక్ష ఉద్యమానికే కాదు, దేశానికే తీరని లోటు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్‌సలో చికిత్సపొందుతున్న ఏచూరి ఆరోగ్యం విషమంచడంతో గురువారం కన్నుమూశారు. ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్టుగా గుర్తింపు పొందిన ఏచూరి 1992నుంచి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. 2005నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్‌నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన సీతారాం బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూలులో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.
అనంతరం ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చేరారు.1970లో సీబీఎస్సీ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. జెఎన్‌యూనుంచి ఎంఏ పట్టా పొందిన ఆయన అక్కడే పీహెచ్‌డీలో చేరారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో సీతారాం చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. చిన్నప్పటినుంచీ చెడును సహించని మనస్తత్వం సీతారాంది. రాజకీయాల్లో ఆసక్తి పెంచుకున్న ఏచూరి రాజకీయ ప్రస్థానం ఎస్‌ఎఫ్‌ఐ నేతగా మొదలైంది. జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్న సమయంలో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై సీపీఎంలో చేరారు.జెఎన్‌యూ విద్యార్థి సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఆ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పక్కనే నిలబడి జెఎన్‌యూ చాన్సలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ధైర్యశాలి. ఇప్పటికీ జేఎన్‌యూపై ఎస్‌ఎఫ్‌ఐ పట్టు కొనసాగుతున్నదంటే అప్పట్లో ప్రకాశ్ కారత్‌తో కలిసి ఆయన వేసిన పునాదులే కారణం.1992లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఎన్నియిన ఏచూరి 2015లో విశాఖలో జరిగిన సీపీఎం మహాసభల్లో పార్టీ అయిదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయన ఆ పదవిలోనే కొనసాగుతున్నారు.
ఇక ప్రజల సమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ పెద్దల సభలో గుర్తింపు పొందిన ఏచూరి 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంకోసం కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్రమంత్రి చిదంబరంతో కలిసి కీలక పాత్ర పోషించారు.అలాగే 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్యభూమిక పోషించారు.రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై అనర్గళంగా మాట్లాడ గలిగే వ్యక్తి. రాజకీయ వేత్తగానే కాక ఏచూరికి రచయితగా కూడా మంచి గుర్తింపు ఉంది.‘ లెఫ్ట్‌హ్యాండ్ డ్రైవ్’ పేరిట ఓ ఆంగ్లపత్రికు కాలమిస్టుగా పనిచేశారు. అలాగే పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడుగా కూడా పని చేశారు.
‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్: న్యూసర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు. విదేశాంగ విధానికి సంబంధించి అమెరికా విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించే వారు. వామపక్ష నేతగా ఉన్నప్పటికీ అన్ని పార్టీల్లోను ఆయనకు మంచి మిత్రులు ఉండడం విశేషం. ఒకప్పడు ఇందిరాగాంధీని వ్యతిరేకిందిన ఆయన ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీతో పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపే వారు.
ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మొదలుకొని పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సంతాపం తెలపడమే రాజకీయాల్లో ఆయనది ఎంత ప్రత్యేక ముద్రో అర్థం అవుతుంది. ఏచూరి వామపక్ష ఉద్యమానికి దారిదీపం అంటూ ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఇక సీతారాంతో సుదీర్ఘ చర్చలను కోల్పోతున్నందుకు ఎంతగానో బాధగా ఉందని రాహుల్ అన్నారు. కమ్యూనిస్టు నేత ఒరవడిని కొనసాగిస్తూ ఏచూరి పార్థివదేహాన్ని వైద్య పరిశోధనలకు ఎయిమ్స్‌కు అందజేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో ఆయన మరణానంతరం కూడా అమరుడిగా నిలిచారు.