- ఇన్‌చార్జిలతోనే వెళ్లదీత?
- కార్యాలయం వైపు కన్నెత్తి చూడని ‘ఫారెన్‌సర్వీసెస్ పరీక్ష’ అభ్యర్థులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణ లో ఉండే సమగ్ర శిక్ష హైదరాబాద్ జిల్లా కార్యాలయంలోని వివిధ విభాగాలకు రెగ్యులర్ కో ఆర్డినేటర్లు కరువయ్యారు. పాఠశాల ల్లో మౌలిక వసతుల కల్పనపై పర్యవేక్షించే కీలకమైన ప్లానింగ్ కోఆర్డినేటర్ పోస్టు కూడా ఖాళీగా ఉన్నది. ప్రస్తుతం మరో విభాగానికి కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వారికే ప్లానింగ్ విభాగం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం కీలకంగా తీసుకున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఇన్‌చార్జి కో ఆర్డినేటర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇతర విభాగాల కో ఆర్డినేటర్లుగా పని చేస్తున్న మరో ముగ్గురు కూడా జనరల్ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నవారే ఉన్నారు.
డిప్యూటేషన్‌పైనే విధులు
ప్రభుత్వం కొన్నేళ్లుగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఈ విభాగానికి రెగ్యులర్ ఉద్యోగులను నియమించ లేదు. ఫారెన్ సర్వీసెస్ పరీక్షను నిర్వహించి, మెరిట్ సాధించిన ఆసక్తి గల అభ్యర్థులను సమగ్ర శిక్షలో కో ఆర్డినేటర్లుగా నియమిస్తారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ పరీక్షల్లో అర్హత సాధించిన వారెవరూ కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో పలువురు స్కూల్ అసిస్టెంట్‌లు, ఎస్జీటీలను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి పని చేయిస్తున్నారు.
టీచర్లు డిప్యూటేషన్‌పై రావడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై వచ్చిన కో ఆర్డినేటర్లు స్కూల్‌అసిస్టెంట్, ఎస్జీటీ క్యాడర్‌కు చెందిన వారు కావడంతో మండల స్థాయిల్లో ఉన్న సీనియర్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. డిప్యూటీఈవోలు, హెడ్మాస్టర్లకు సమా చారం చేరవేయడం, తీసుకోవడం, కార్యక్రమాలను నిర్వహించే సందర్భంలో ఆటంకా లు ఏర్పడుతున్నాయి.
సీనియర్ హెచ్‌ఎంలు ఈ బాధ్యతల్లో ఉంటే సమగ్ర శిక్ష పనులు సులభమవుతాయని పలువురు చెబుతున్నారు. కోఆర్డినేటర్లుగా ఉన్న వారందరూ ఉపాధ్యాయులే కావడంతో బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో వచ్చే పని ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి భరించలేక గతంలో ఉన్నవారు నిష్క్రమించినట్లు సమాచారం. ప్రభుత్వం, కలెక్టర్, విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుని రెగ్యులర్ కోఆర్డినేటర్లను నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.