ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న యువ కథానాయకుల్లో నవీన్ పొలిశెట్టి ఒకరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నవీన్ పేరు తెలుగునాట మరో స్థాయికి చేరుకోవడానికి కారణం.. ఇటీవల ఆయన వరుసగా మూడు విజయాలు అందుకోవడమే! తీవ్ర గాయాల కారణంగా నవీన్ ఏడాది కాలం పాటు నటనకు దూరమయ్యారు.
ఇప్పుడు పూర్తిగా కోలు కొని, మరో కొత్త సినిమాతో వస్తున్నారు. ఆ చిత్రమే ‘అనగనగా ఒక రాజు’. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు.
ఈ వీడియో పూర్తి వినోదాత్మకంగా ఉంది. నవీన్ పొలిశెట్టి పోషించిన రాజు పాత్ర తన వివాహానికి సిద్ధమవుతున్నట్లు ఈ వీడియోలో చూపించారు. రాజు గారి పెళ్లి అంటే ఎలా ఉండాలి? అంటూ భోజనాల దగ్గర చమ్మక్ చంద్ర చేసిన హడావుడి నవ్వులు పూయించింది.
ఇక అనంత్ అంబానీ వివాహానికి హాజరైన హాలీవుడ్ ప్రముఖుల ఫోన్ నెంబర్ల కోసం, నవీన్ ఏకంగా ముఖేశ్ అంబానీకి ఫోన్ చేసి మాట్లాడినట్టు చూపించడం కడుపుబ్బా నవ్వించింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ సమయంలో వధువుగా మీనాక్షి చౌదరి కనిపించారు.
నవీన్‌తో ఆమె కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మారి తెరకెక్కిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.