- పది రోజుల్లోనే 852 కోట్ల మద్యం అమ్మకాలు
- మరో రెండు రోజులు 300 కోట్ల అమ్మకాలు!
- రంగారెడ్డి జిల్లా ఫస్ట్
- భద్రాద్రి కొత్తగూడెం లాస్ట్
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది కంటే ఇప్పుడు మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. గడిచిన పది రోజులుగా అంటే అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రూ. 852.40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ. 800.01 కోట్ల మద్యం విక్రయం జరిగింది. గతం కంటే ఈ ఏడాది అదనంగా 6.55 శాతంతో రూ. 52.39 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. మరో రెండు, మూడు రోజుల్లో దాదాపు రూ. 300 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరగొచ్చని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే జోరుగా సాగుతున్నట్లు సంబంధిత అధికారులు చెబతున్నారు.
రూ. 2,838.92 కోట్ల మద్యం అమ్మకాలు
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో రూ. 2,838.92 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్స్ షాపులు, 1,171 బార్లు ఉన్నాయి. తెలంగాణలో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. చివరి నాలుగు స్థానంలో వరస గా భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జోగులాంబ గద్వా ల, నిర్మల్ జిల్లాలు ఉన్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు లిక్కర్ అమ్మకాలు..
సంవత్సరం లిక్కర్ బీరు మొత్తం విలువ
( కేసులు లక్షల్లో) ( కేసులు లక్షల్లో ) ( రూ. కోట్లలో )
2024 28.82 39.77 రూ. 2,838.92
2023 26.46 40.7 రూ. 2,640.33
అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు మద్యం అమ్మకాలు..
2024 7.03 12.18 రూ. 852.40
2023 6.61 12.99 రూ. 800.01