calender_icon.png 13 December, 2024 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు కుంభకోణంలో కీలక పరిణామం

12-12-2024 12:35:36 AM

* ముగ్గురిని దోషులుగా తేల్చిన ప్రత్యేక సీబీఐ కోర్టు

* దోషిగా అభిజిత్ ఇన్‌ఫ్రాస్టక్చర్స్, డైరెక్టర్, మాజీ డైరెక్టర్ 

  1. * ఖరారు కాని శిక్ష

* నవభారత్ పవర్ కంపెనీకి భారీ ఊరట.. నిర్దోషిగా ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: 2016 నాటి బొగ్గు కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అభిజిత్ ఇన్‌ఫ్రాస్టక్చర్స్‌తో పాటు మరో ఇద్దరిని నిందితులుగా తేల్చింది. అభిజిత్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ జయస్వాల్, మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ జయస్వాల్‌లను దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని బ్రిండా, సిసాయి, మెరల్ గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై 2016లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. అభిజిత్ కంపెనీ తనకున్న పరపతిని ఉపయోగించి తప్పుడు ఆర్థిక వివరాలను సమర్పించి గనులను దక్కించుకుందని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది.

విచారణలో కంపెనీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించినట్లు తేలడంతో కోర్టు వారిని దోషులుగా తేల్చింది. ప్రత్యేక న్యాయమూర్తి అరుణ్ భరద్వాజ్ దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చారు. వారికి ఏం శిక్ష వేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. ఇదే కేసులో ఇన్ని రోజులు దోషులుగా ఉన్న నవభారత్ పవర్ ఎండీ హరిశ్చంద్రప్రసాద్, చైర్మన్ త్రివిక్రమ ప్రసాద్, హరిశ్చంద్ర గుప్తా, సమారియా సహా మొత్తం ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు మొత్తం 38 మంది సాక్ష్యుల వాంగ్మూలం తీసుకుంది.