- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ప్రత్యేక దృష్టి
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమాలోచనలు
- ఒకే అయితే.. నగరంలో అన్యాక్రాంతమైన
- రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్
ఖమ్మం, ఆగస్టు 24 (విజయక్రాంతి): రాజధానితో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన 70కి పైగా చిన్న, మధ్య, భారీ భవనాల కూల్చివేసి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరహా వ్యవస్థను ఖమ్మ ంలోనూ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో హైడ్రా సత్ఫలితాలు ఇస్తుండడంతో ఇదే తరహా వ్యవస్థ ను రాష్ట్రంలోని మరికొన్ని నగరాల్లో ఏర్పా టు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ లిస్ట్‌లో ఖమ్మం నగరం కూడా ఉన్నట్లు భోగట్టా. దీనిపై డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. తాజాగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను కూడా కూల్చిన సంగతి విదితమే. హైడ్రాతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ సాధ్యమైంది. అలాగే పర్యావరణానికి మేలు జరుగుతోంది.
ఇప్పటికే కబ్జాలు.. అరెస్టులు..
ఐదేళ్లలో ఖమ్మం నగరం అన్ని విధాలా ఎంతో అభివృద్ధిని సాధించింది. నగరానికి ఇరువైపులా రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఉండడం, జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి కావొస్తుండడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా వృద్ధి చెందిన నేపథ్యంలో భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొంందరు అక్రమార్కుల కళ్లు విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖం భూములపై పడింది. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసేందుకు వారు సిద్ధమయ్యారు. కొన్నిభూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి.
కబ్జా ఆరోపణలతో కొందరు నేతలపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. వారు జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు మొదలుకొని, పక్కనే ఉన్న కొత్తగూడెం చెరువు, మున్నేరు, ఎన్నెస్పీ కాలువలు ఆనుకొని ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా వంటి విభాగం నగరానికి వస్తే భూముల ప్రక్షాళన జరుగుతుందని నగరవాసులు భావిస్తున్నారు.