- హైడ్రా వచ్చిన తర్వాత బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు
- భూ సమస్యల పరిష్కారానికి తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
- జేపీసీ సభ్యురాలు డీకే అరుణతో కలిసి బోడుప్పల్‌లో పర్యటన
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో హైడ్రా వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారని, హైడ్రా పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ప్రజలు భావిస్తున్నారని మల్కాజిగిరి ఎం పీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ, హైడ్రా కారణంగా బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదన్నా రు. వక్ఫ్ స్థలాల పరిశీలన కార్యక్రమం లో భాగంగా జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) సభ్యురాలు డీకే అరుణతో కలిసి ఈటల రాజేందర్ శనివారం బోడుప్పల్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నెలకొన్న భూముల సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. కూల్చివేతలకు ఒక పద్ధతి అంటూ లేకుండా పీర్జాదిగూడలో అక్కడక్కడ ఐదు ఇళ్లు కూలగొట్టారన్నారు. అన్ని రకాల అనుమతులు తీసుకొని ఇంటి నిర్మాణం చేశాక.. వారిని వేధించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని, వ్యాపారాలు, రిజిస్ట్రేషన్లు పడిపో యాయని మండిపడ్డారు.
ఎల్‌బీ నగర్‌లో శాశ్వతంగా ఇళ్లను ఇచ్చి అమ్ముకునే అధికారం లేకుండా చేశారని, దేవరయాంజల్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. బోడుప్పల్‌లో వక్ఫ్ భూముల పేరుతో 10 వేల కుటుంబాలు బాధపడుతున్నాయని జేపీసీ సభ్యురాలు డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను పరిష్కరించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.