calender_icon.png 26 October, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో హైడ్రా తరహాలో స్కాడా

23-07-2024 01:35:35 AM

  • 4 సర్కిళ్ల నుంచి 10 సర్కిళ్లకు విస్తరణ 
  • విద్యుత్ సరఫరా, అంతరాయాలపై నిఘా 
  • రూ. 25 కోట్లతో పనులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజిస్టార్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) మాదిరిగానే విద్యుత్ శాఖలోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) నగరంలో విద్యుత్ సరఫరా, అంతరాయాలను పర్యవేక్షించేందుకు సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడా) విభాగాన్ని విస్త రించనుంది. ఇప్పటి వరకూ ఈ వ్యవస్థ హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లకు మాత్రమే పరిమితం కాగా, స్కాడా విస్తరణ అనంతరం హైదరాబాద్ మెట్రోజోన్, రంగారెడ్డి , మేడ్చల్ జోన్ల పరిధిలోని 10 సర్కిళ్లలో ఉండే 33కేవీ/11 కేవీ సబ్ స్టేషన్లను కార్యాలయం నుంచే అధికారులు, సిబ్బంది పర్యవేక్షించనున్నారు.

కొత్తగా 112 సబ్ స్టేషన్లు 

హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లకు మాత్రమే పరిమితమైన స్కాడాను 2003లో ప్రారంభించారు. 4 సర్కిళ్లలో 222 సబ్ స్టేషన్లను ప్రస్తుతం ఎర్రగడ్డలోని ప్రత్యేక కార్యాలయం నుంచి  స్కాడా పర్యవేక్షిస్తున్నది. కొత్తగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సరూర్ నగర్, మేడ్చల్, హబ్సీగూడ, సంగారెడ్డి సర్కిళ్ల పరిధిలోని 112 సబ్ స్టేషన్లు స్కాడా పరిధిలోకి రానున్నాయి. అంతే కాకుండా, ప్రతి సెక్షన్‌లో మంజూరవుతున్న పనులు శాప్ ద్వారా సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ మొత్తం డేటా టీజీఎస్‌పీడీసీఎల్ యాప్‌కు కనెక్ట్ కానుంది. దీంతో మొత్తం 334 సబ్ స్టేషన్ల సమాచారాన్ని సీఎండీ నేరుగా పరిశీలించనున్నారు.

ఈ విభాగంలోని అధికారులు, సిబ్బంది సబ్ స్టేషన్ల పనితీరు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ వివరాలతో పాటు ఏయే సబ్ స్టేషన్ల పరిధిలో అంతరాయం చోటు చేసుకుంటుందనే విషయాలను పరిశీలిస్తారు. ఈ డేటాను ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. స్కాడా అధికారులు డేటా ఆధారంగా విద్యు త్ సరఫరా, అంతరాయాలపై ఉన్నతాధికారులు మెరుగైన చర్యలు చేపట్టడానికి వీలుం టుంది. కొత్త సర్కిళ్ల పరిధిలోని 112 సబ్ స్టేషన్లను స్కాడాకు అనుసంధానం చేసేందుకు రూ. 25 కోట్లతో పనులు చేపట్టను న్నారు.

దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్టు గా తెలుస్తున్నది. ఈ పనులు పూర్తి కాగానే, విద్యుత్ సరఫరాలో మెరుగైన చర్యలు చేపట్టమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న పోల్స్ , డీటీఆర్‌లు ఆన్‌లైన్‌తో అనుసంధానం కానున్నాయి.