- ఏడాదిలో ప్రజలను రోడ్డెక్కించారు
- తెలంగాణను అవినీతి రాష్ట్రంగా మార్చారు
- సీఎం ప్రజలను హింసిస్తుంటే మౌనమెందుకు
- రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, నవంబర్ 4(విజయ క్రాంతి): కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణ రాష్ట్రం వందేళ్ల విధ్వంసానికి గురైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు కేటీఆర్ సోమవారం బహిరంగ లేఖ రాశారు.
పిలస్తే క్షణంలో వస్తానని చెప్పి, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజల గొంతు కోశారని మండిపడ్డా రు. తెలంగాణలోని అన్ని వర్గాలను నయవంచనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 రోజులు పూర్తునా హామీల అమలు నోచుకోలేదని ఎద్దేవా చేశారు. అభ య హస్తం అని చెప్పి భస్మాసుర హస్తంతో తెలంగాణ ప్రజలను ముంచారని ఆరోపించారు.
నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజమని విమర్శించారు. ఆరు గ్యారెంటీల బాధ్యత నాది అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వైపు తొంగి కూడా చూడలేదని రాహుల్ గాంధీని విమర్శించారు. ఉచిత బస్సు మినహా ఏ ఒక్క గ్యారెంటీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులను పోలీసులతోనే కొట్టించిన ఘనత మీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మూసీ, హైడ్రా పేరుతో పేద ప్రజల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.
గాంధీ భవన్‌కు కాకుండా తెలంగాణ ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఏడాది పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. నాలుగేళ్లలో ఇంకా ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో అని విమర్శించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించకుండా అడ్డగోలు నిర్ణయాలతో తెలంగాణ భవిష్యత్ తలకిందులైందన్నారు. దొరికిందే అవకాశమని సీఎం తోపాటు మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కుంభకోణాలకు కేరా ఫ్ అడ్రస్‌గా రాష్ట్రాన్ని మార్చారన్నారు. రూ. లక్షా 50 వేల కోట్లతో చేపడుతున్న మూసీ ప్రాజెక్టులో ఢిల్లీ వాటా ఎంత అని ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయింపులపై తేలుకుట్టిన దొంగ లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది తిరగకముందే రోడ్లపై తిరగలేని దుస్థితిని కాంగ్రెస్ నాయకులు తెచ్చుకున్నారని విమర్శించారు. అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణను అవినీతి రాష్ట్రంగా మార్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహు ల్ గాంధీని డిమాండ్ చేశారు.
‘టెస్లా’ను తెలంగాణకు తీసుకువచ్చే ప్రయత్నాలేవీ?
‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్న
రాష్ట్రప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజమైన టెస్లా కంపెనీ యూనిట్‌ను తెలంగాణకు తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోవడం శోచనీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. గుజరాత్, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏదో ఒక చోట టెస్లా యూనిట్ వచ్చే అవకాశం ఉందని, అమెరికాతో పాటు అనేక విదేశీ పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి టెస్లా సంగతి ఎందుకు పట్టదో తెలియడం లేదన్నారు.