22-03-2025 01:38:30 AM
గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
రాజేంద్రనగర్, మార్చి 21 (విజయ క్రాంతి): ఏడాదిన్నరకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. లోకం పోకడ తెలియని ఆ చిన్నారి ఆడుకుంటుండగా ఆమె పైనుంచి ఆటో వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషాదకర సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ దొడ్డిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం..నాగర్ కర్నూలు జిల్లా మరికల్ గ్రామానికి చెందిన కాకం శివ శంకర్, రేణుక దంపతులు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం శంషాబాద్ కి వచ్చి రాళ్లగూడ విలేజ్ లో నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. భార్యాభర్తలకు ఏడాదిన్నర కూతురు కీర్తి ఉంది. శుక్రవారం ఉదయం దంపతులు ఇందిరా నగర్ దొడ్డిలో ఓ నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్దకు కూలీ పనికి వెళ్లారు.
దంపతులు పనిలో నిమగ్నమై ఉండగా చిన్నారి పక్కనే ఆడుకుంటుంది. అంతలో సిమెంటు లోడ్ తో వచ్చిన ఓ టాటా ఏస్ వాహనము డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడపడంతో కీర్తి పైనుంచి వాహనం వెళ్ళింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో ఆగ్రహానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు డ్రైవర్ ను చితకబాదారు. అనంతరం డ్రైవర్ చాంద్ అలీ ని పోలీసులకు అప్పగించారు.
గుండెలవిసేలా రోదించిన చిన్నారి తల్లి
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు కళ్ళముందే కానరాని లోకాలకు తరలి వెళ్లడంతో శివశంకర్, రేణుక దంపతులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కన్నపేగు కన్ను మూయడంతో రేణుక రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు.