calender_icon.png 23 September, 2024 | 3:00 AM

గోవు మా తల్లికి శతకోటి దండాలు

20-09-2024 12:00:00 AM

అమ్మ తర్వాత ఆవుకు అంతటి మాతృ స్థానాన్ని సనాతన భారతీయులు ఎందుకు కల్పించారు? ఏమిటి ఈ సాధుజంతువులోని గొప్పతనం? మిగిలిన అన్ని ప్రాణులకంటే ఎందులో దానికి ఎక్కువ విలువ? మరే జంతువుకూ ఇవ్వనంత పవిత్ర భావన దీనికి మాత్రమే ఏల కలిగించారు? ఈ సత్యాలు గ్రహించిన వారు గోవు మా తల్లికి దండాలు పెట్టకుండా వుండలేరు. అప్పుడు మన చేతుల్తో మనం ఆ మహాతల్లిని హింసించడమో, ప్రాణం తీయడమో చేయం. ఇప్పటికైనా, రాజకీయాలు, మతాలకు అతీతంగా ఆవును మన ‘దేశ (రాష్ట్ర)మాత’గా ప్రకటించుకోవడానికి కావలసిన అనుకూల వాతావరణాన్ని కల్పించుకుందాం.

పంచమాతలలో ఒకరు

జగన్మాత శ్రీఆదిపరాశక్తి లోకంలో నాలుగు రూపాలతో ఉంటుంది. మన కన్నతల్లి, గోమాత, భూమాత, శ్రీమాత- (అమ్మవార్లు: సరస్వతి, లక్ష్మి, పార్వతి, గాయత్రి, దుర్గాదేవి, కాళికాదేవి, చౌడేశ్వరి దేవి ఇంకా గ్రామ దేవతలు ఎవరైనా). జగన్మాత శ్రీలలితాదేవి సహస్రనామాలలో గోమాతకూడా ఉంది. అంటే, గోమాత సాక్షాత్తు శ్రీఆదిపరాశక్తి అవతారం. ఇంతేకాదు, గోవులో 33 కోట్లమంది దేవతలు కొలువై ఉంటారు. కనుక, గోపూజ లలితాదేవి ఆరాధన కిందే లెక్క. ఋగ్వేదంలోని 4వ కాండలో 12వది ‘గోసూక్తం’. ఇందులోనిదే ‘గోమాత మహత్యం’. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం వలె గోసూక్తమూ అంతే పవిత్రం.

గోవులకూ ఓ స్వర్గలోకం

గోసేవ వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘దంపతులకు సత్సంతానం కలుగుతుంది. అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయి’. పంచమహా పాతకాలలో గోహత్య ఒక టి. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ దుష్ఫలానికి నివృ త్తి ఉండదని వేద పండితులు అంటారు. క్షీర సాగర మథనం సమయంలో నంది, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని ‘భవిష్య పురాణం’ చెబుతున్నది. వీటినే ‘కామధేనువులు’ అంటారు. ఆవు పుట్టుక కథనం ‘శతపథ బ్రాహ్మణం’లోనూ ఉంది.

“గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణంలోను, బభ్రు వర్ణంలోను, శ్యామ వర్ణంలోనూ, ఎరుపు రంగు, పింగళ(చిత్ర) వర్ణంలోనూ ఉంటాయి” అని ‘స్కాంద పురాణం’ చెబుతున్నది. బ్రహ్మదేవుడు సురభికి అమరత్వాన్ని ప్రసాదించాడు. త్రిలోకాలపైన ఉండే స్వర్గాన్ని గోవుకు వరంగా ఇచ్చాదంటారు.  దీనినే ‘స్వర్గ గోలోకం’ అని పిలుస్తారు. ఆ గోలోకంలోనే సురభి నివసిస్తుంది. ఆమె కన్యలు, సుకన్యలు భూలోకంలో నివసిస్తారు. ఆ సురభిరోమ కూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు. 

బ్రహ్మ సృష్టిలోనిది కానిది

రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపంలో అమృతంగా గోవును పిలుస్తారు. ఋగ్వేదంలో ఆవును ‘అఘణ్య’ అన్నారు. గోవులో చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతున్నది. దీన్నిబట్టి గోవు ‘పృథ్వీ’రూపం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదని పండితులు అంటారు. అష్ట వసువులూ ఒక్క సంవత్సరం పాటు హోమం చేసి, ఆ తపశ్శక్తితో ఒక గోవును సృష్టించారు. ఆ గోవు సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చినట్లు కూడా చెప్తారు. వేదం గోవుని ‘గౌరగ్నిహోత్రః’ అంది. గోవు అగ్నిహోత్రం. అగ్ని స్వరూపం. అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో, గోవు కూడా అన్ని సంపదలనూ ఇవ్వగలదు.  

మహా దివ్య స్వరూపం 

గోవు  దివ్య స్వరూపం సామాన్యమైంది కాదు. సమస్త దేవతలు తమ నివాస స్థానాన్ని గోమాత అంగాలలో నెలకొల్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంతో గోప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సరిసమాన పుణ్యఫలలాన్నిస్తుంది. ధేనువు కుడి కొమ్ములో గంగా, ఎడమ కొమ్ములో యమున, కొమ్ముల మధ్యలో సరస్వతీ నదులు ప్రవహిస్తుంటాయి. గోవు మూపున బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో రుద్రమహేశ్వరాది సహితంగా శివుడు, కటి ప్రదేశంలో విష్ణుమూర్తి నివసిస్తారు. గోమాత పృష్ఠభాగంలో సర్వపుణ్యతీర్థాలు, గోగర్భంలో కుడివైపు మహర్షి గణాలు, ఎడమవైపు దేవతాగణాలు, అడుగున సమస్త నదులూ ఆసీనులై ఉంటాయి. గోవు నాలుగు పాదాల గిట్టలలో చతుర్వేదాలు ఉంటాయి. గోవు కాలిగిట్టలలో అన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయి. గంగకంటేకూడా గోధూళి గొప్పదని చెప్తారు.

గోవు పాదం- పితృ దేవతలు, పిక్కలు- పిడు గంటలు, అడుగులు - ఆకాశ గంగలు, ముక్కోలు కొలుకులు- ముచ్హిక చిప్పలు, పొదుగు -పుండరీకాక్ష, గోమయం - శ్రీలక్ష్మీ, పాలు  పంచామృతాలు, తోక - 90 కోట్ల ఋషులు, బొడ్డు - పొన్న పువ్వు, కడుపు - కైలాసం, కొమ్ములు - కోటి గుడులు, వెన్ను - యమధర్మరాజు, ముక్కు - సిరి, కళ్ళు - కలువ రేకులు, చెవులు - శంఖనాదం, నాలుక - నారాయణ స్వరూపం, దంతాలు- దేవతలు, పళ్ళు- పరమేశ్వరి, నోరు- లోకనిధి.  

ఆవులకు నీరు తాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి ‘అశ్వమేధ యాగం’ చేసినంత పు ణ్యం వస్తుందని అంటారు. 84 లక్షల జీవరాశులలో ఆవు అత్యంత పవిత్రమైంది. గోమ యంలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి నివాసముంటారు. గోవులు ఎక్కడ నివాసముంటాయో ఆ ప్రదేశం శోభాయమాన మవటమే కాక ఆ స్థలంలోని పాపాలన్ని నశిస్తాయి. అందుకే, గోశాల పవిత్ర ప్రదేశం. లక్ష్మీ దేవి ఉండే అయిదు స్ధానాలలో ‘ఆవు వెనక తట్టు’ ఒకటి కనుక (మిగిలిన నాలుగు: ఏనుగు కుంభస్థలం, తామరపువ్వు, బిళ్వదళం వెనుక ఈనెలు ఉండే భాగం, సువాసిని పాపట ప్రారంభస్ధానం). అందుకే, గోసేవ మనకు ప్రథమ కర్తవ్యం. గోమాత పాదాలకు శతకోటి వందనాలు సమర్పిద్దాం.

రాష్ట్రమాతగా గోమాత

‘గోమాత రాష్ట్రమాత- రాష్ట్రమాత భారత్ మాత’ అనే నినాదంతో జ్యోతిర్మఠ్ జగద్గురు శంకరాచార్య స్వామీజీ అవిముక్తేశ్వరానంద సరస్వతి 22వ తేదీనుంచి దేశవ్యాప్తంగా ‘గోధ్వజ్ స్థాపన’ యాత్ర చేపట్టడం అభినందనీయం. మన రాజ్యాంగం, చట్టాలలో గోమాతకు తగిన ప్రాధాన్యం కల్పించడం, తద్వారా దేశవ్యాప్తంగా సంపూర్ణ గౌరవాన్ని సాధించడమే లక్ష్యంగా వారి ఆందోళన కార్యక్రమం సాగుతున్నది. ఈ యాత్ర అయోధ్యలో మొదలై యూపీ, బీహార్, సిక్కిం, అసోం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా,  ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల మీదుగా అక్టోబర్ 9న తెలంగాణకు చేరుకోనుంది.

- ‘ప్రార్థన’ డెస్క్