మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : పత్తి, ధాన్యం కొనుగోలు విషయంలో రూ.వంద కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
దళారులు, మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కయ్యారని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో అధికారులపై జరిగిన దాడితో సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు.
కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ టైం పాస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కలెక్టర్ తమపై దాడి జరగలేదని చెబుతున్నా ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతుందో? రాష్ర్టంలోని మేధావులు ఒకసారి కొడంగల్‌కు వెళ్లి రావాలని జగదీశ్‌రెడ్డి కోరారు. రాష్ర్ట ప్రభుత్వ అవినీతిపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్‌రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయమన్నారు.