calender_icon.png 14 November, 2024 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాధుల కింద భారీ సొరంగం

12-11-2024 02:43:39 AM

దక్షిణ లెబనాన్‌లో గుర్తించిన ఇజ్రాయెల్ సైన్యం

న్యూఢిల్లీ, నవంబర్ 11: లెబనాన్‌తో ఇజ్రాయెల్ సుదీర్ఘకాలంగా యుద్ధం చేస్తున్న తరుణంలో హెజ్బొల్లాకు చెందిన భారీ టన్నెల్ బయటపడింది. దక్షిణ లెబనాన్‌లోని సమాధుల కింద గుర్తించిన హెజ్బొల్లా రహస్య టన్నెల్‌కు సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ (ఐడీఎఫ్) సోషల్ మీడియాలో షేర్ చేసింది. కిలోమీటర్ల మేర పొడవున్న ఈ సొరంగంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు, తుపాకులు, రాకెట్లు గుర్తించినట్టు ఐడీఎఫ్ తెలిపింది.

హెజ్బొల్లాకు మానవ జీవితం అంటే లెక్కలేదని చనిపోయినా బతికినా పట్టించుకోదని పోస్ట్‌లో విమర్శించింది. అంతేకాకుండా తాము గుర్తించిన టన్నెల్‌ను ధ్వంసం చేసి 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో మూసేసినట్టు పేర్కొంది.

హెజ్బొల్లా కమాండర్ హతం

సిరియాలోని డమాస్కస్‌లో హెజ్బొల్లాకు సంబంధించిన అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో లెబనాన్ పౌరసత్వం కలిగిన హెజ్బొల్లా కమాండర్ సలీమ్ జమీల్ హతమయ్యాడు. కమాండర్‌తో పాటు మొత్తం 9 మంది మృతి చెందినట్టు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. కాగా గతంలో లెబనాన్ మాజీ ప్రధాని హత్య కేసులో సలీమ్ జమీల్‌కు కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. 

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ దాడులు

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా సోమవారం రాకెట్‌లతో విరుచుకుపడింది. హైఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని 90 రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడులను ఇజ్రాయెల్ కూడా ధ్రువీకరించింది. మొదటగా దాదాపు 80 రాకెట్లు దూసుకొచ్చాయనీ ఆ తర్వాత మరో 10 రాకెట్లు వచ్చినట్టు తెలిపింది. వాటిలో అధిక సంఖ్యలో రాకెట్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దీటుగా ఎదుర్కొన్నట్టు వివరించింది.