calender_icon.png 7 January, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపూఘాట్‌లో గాంధీ భారీ విగ్రహం!

02-11-2024 12:56:04 AM

  1. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాటుకు సర్కార్ కసరత్తు 
  2. బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేలా కార్యాచరణ 
  3. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పనులు వేగవంతం చేసిన అధికారులు 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): మూసీ తీరంలోని బాపుఘాట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సర్కార్ ఆలోచిస్తోంది.

మూసీనది తీరంలో ఎంత ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే అంశమై అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోదర సౌభ్రాతత్వం, ప్రపంచశాంతి, ఆధ్యాత్మికత, విద్యాబోధనకు కేంద్రంగా బాపుఘాట్‌ను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్‌ను అధునాతనంగా తీర్చిదిద్దాలని తన ఆలోచనలను సీఎం ఇటీవల అధికారులతో పంచుకున్నారు. సీఎం ఆదేశాలతో బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

విగ్రహం ఎత్తు, నమూనాపై అధ్యయనం   

మూసీనది సుందరమైన విశాల తీరంలో.. బాపూఘాట్‌లో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విగ్రహం ఏ ఆకృతిలో తయారు చేయాలి? ఎంత ఎత్తులో ఉండాలి? డిజైన్లు ఎలా ఉండాలి? అనే అంశాలపై ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. దేశవిదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలు, ఆశ్రమాలున్నాయి? వాటిని ఏయే నమూనాల్లో ఏర్పాటు చేశారు? తదితర అంశాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.

పాట్నాలో 72 అడుగుల మహాత్ముడి విగ్రహం   

ప్రస్తుతం దేశంలో ఉన్న గాంధీ విగ్రహాల్లో పాట్నాలోని గాంధీ మైదానంలో ఉన్న 72 అడుగుల విగ్రహం అతిపెద్దది. దీన్ని 2013లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కాంస్యంతో తయారుచేశారు. ఇద్దరు చిన్నారులతో గాంధీ ఆప్యాయంగా ఉన్నట్లుగా  విగ్రహాన్ని రూపొందించారు.

అంతే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లోనూ గాంధీ విగ్రహాలున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహం ఉంది. విదేశాల్లో ఉన్న అతిపెద్ద గాంధీ విగ్రహం ఇదే. గాంధీ దండియాత్రకు నడుస్తున్న భంగిమలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.  

182 మీటర్ల ఎత్తులో పటేల్ విగ్రహం.. 

2018లో గుజరాత్‌లోని నర్మదానదీ తీరంలో ఐక్యతకు చిహ్నంగా సర్దార్ వల్లాభ్‌బాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా దీన్ని నిర్మించారు.

ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే ఎత్తున గాంధీ విగ్రహం నిర్మించాలా? పాట్నాలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మించిన ఎత్తులో నిర్మించాలా? కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్న భంగిమలో విగ్రహాన్ని తయారు చేయించాలా? దండియాత్రకు కదులుతున్నట్లుగా నిలబడి ఉండాలా? మరేదైనా నమునాను ఎంచుకోవాలా? అనే విషయం లో విస్తృతస్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలని, అవసరమైతే అన్నివర్గాల మేధావులు, అన్ని పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధుల సలహాలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఉన్న విగ్రహం 22 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విగ్రహం మైలైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే సందేశంతో.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు 1999లో ఆవిష్కరించారు.        

ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమం   

అటు ఉస్మాన్‌సాగర్, ఇటు హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్ ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని గాంధీ సరోవర్‌గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశ యాలను ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ కోర్సులు నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాపూఘాట్‌లో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటు నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.