- 163 మంది ఏఈవోలపై వేటు
- డిజిటల్ సర్వే చేయకపోవడంతో చర్యలు
- కావాలనే చేశారని ఏఈవోల సంఘం ఆరోపణ
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ 163 మంది అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారుల(ఏఈవో)పై సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘనందన్‌రావు ఆదేశాల మేరకు డైరెక్టర్ గోపి మంగళవారం సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఏఈవోలు డిజిటల్ సర్వే చేయమని ససేమిరా అనడంతో వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడంతోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో గత 29 రోజులుగా ఏఈవోలు పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టారు. తాజాగా డిజిటల్ సర్వే చేయడం లేదనే కారణంలో వారిపై వేటు పడటంతో వివాదం ముదిరిపోయింది. ఇతర కారణాలు చెబుతున్నప్పటికి ప్రధానంగా డిజిటల్ సర్వే యాప్ డౌన్ లోడ్ చేయకుండా సర్వే చేయలేదనే కారణంతో సస్పెండ్ చేసినట్లు ఏఈవోలు ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ క్రాప్ సర్వే చేయాలంటే సహాయకులను ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ కమిషనర్ రఘనందన్‌రావు తన కొడుకు, అల్లుడు సంస్థల కోసం యాప్‌లు చేయించి కోట్ల రూపాయలు నిర్వహణకు వాడుతూ యాప్‌లను తమపై రుద్దుతూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం అండ చూసుకుని తమ జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంట సర్వే, రైతు బీమా, రైతు భరోసాతో పాటు 49 రకాల సేవలు అందిస్తున్నామని, వ్యవసాయ శాఖ తమను వాడుకుంటూ ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.
సస్పెండ్ ఎత్తివేసే వరకు విధులకు హాజరవ్వం..
ఏఈవోలపై ప్రభుత్వం సస్పెండ్ ఎత్తివేసే వరకు విధులకు హాజరు కాబోమని ఏఈవోల జేఏసీ ప్రకటించింది. డీసీఎస్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోనందుకు 163మందిపై దుర్మార్గంగా వేటు వేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ సస్పెండ్ ఎత్తివేసే వరకు ఉద్యోగాల్లో చేరబోమని, విస్తరణ అధికారులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిత ఏడీఏలకు మాస్ లీవ్ లెటర్లు ఇవ్వడం జరిగిందన్నారు.