21-03-2025 01:44:09 AM
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): రాష్ట్ర విద్యుత్ చరిత్రలోనే భారీ రికార్డు గురువారం నమోదైంది. సాయంత్రం 4.39 గంటలకు రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకుంది. గతేడాది ఇదే రోజు నమోదైన గరిష్ఠ విద్యుత్ డిమాండ్ కేవలం 13,557 మెగావాట్లు మాత్రమే. ఒక సంవత్సరంలోనే 3,500 మెగావాట్లకుపైగా డిమాండ్ పెరగడం గమనార్హం.
గతేడాది మార్చి 8న 15,623 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. దీనిని ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే అధిగమించింది. మార్చి ప్రారంభం నుంచే 16,000 మెగావాట్లకుపైగా డిమాండ్ నమోదవుతూ వస్తోంది. ఈనెల 18న 16,976 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదయ్యింది. గురువారం సాయంత్రం ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.
ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకున్నా.. చిన్న ఇబ్బందికూడా లేకుండా ప్రజాప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నమోదైన డిమాండ్ రాష్ట్ర చరిత్రలో కొత్త రికార్డుగా పేర్కొన్నారు. పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ కార్యకలాపాలు పెరగడంతో ఈ వేసవిలో భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు.
ఎస్‌పీడీసీఎల్‌కు జాతీయస్థాయిలో మూడో ర్యాంకు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్)కు తాజాగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీ ర్యాంకింగ్ రిపోర్టు, కంజ్యూమర్ సర్వీస్ రేటింగ్ డిస్కమ్స్ (సీఎస్‌ఆర్‌డీ) రిపోర్టు 2023-24లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కేటగిరీలో మొత్తం 41 డిస్కంలకు ర్యాంకులు కేటాయించారు.
దక్షిణ డిస్కం పరిధిలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, అతి తక్కువ సమయంలో విద్యుత్ కనెక్షన్ల మంజూరు తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ డిస్కంలో వినియోగదారులకు, ఉద్యోగులు, అధికారులకు అభినందనలు తెలిపారు. కాగా, బడ్జెట్‌లో విద్యుత్ శాఖకు రూ.21,221 కోట్లు కేటాయించినందుకు పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్, 1104 యూనియన్లు వేర్వేరుగా హర్షం వ్యక్తం చేశాయి.
వేసవిలో ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దు..
వేసవిలో ఏ ఒక్క వినియోగదారుడికి కూడా విద్యుత్ సరఫరాలో సమస్యలు రాకుండా చూడాలని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. వేసవిలో పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేయడానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్ తీసుకుంటున్న చర్యలపై అధికారులతో విద్యుత్‌సౌధలో ఆయన సమీక్షించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్ వార్షిక పెరుగుదల 30 శాతానికి మించి నమోదవుతోందని, గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బౌరంపేట, పటాన్‌చెరు, ఆర్సీపురం, మౌలాలీ, బండ్లగూడ, గచ్చిబౌలి, కైతలాపూర్, బొల్లారం ఈహెచ్‌టీ సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచినట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. సమీక్షలో ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, ట్రాన్స్‌కో జేఎండీ సీ శ్రీనివాసరావు, డైరెక్టర్లు జగత్‌రెడ్డి, ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.