calender_icon.png 11 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడాలో హిందువుల భారీ ర్యాలీ

06-11-2024 02:00:54 AM

దేవాలయాలపై దాడులకు నిరసనగా రోడ్లపైకి

దాడులను ముక్తకంఠంతో ఖండించిన భారత్

బ్రాంప్టన్ (కెనడా), నవంబర్ 5: హిందూ దేవాలయాలపై పదేపదే జరుగుతున్న దాడులకు నిరసనగా కెనడాలోని బ్రాంప్టన్ నగరం లో వేలాదిమంది హిందువులు సోమవారం సాయంత్రం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఉత్తర అమెరికాలోని హిందూ సం ఘాల ఆధ్వర్యంలో బ్రాంప్టన్ హిందూ మహా సభ ఆలయ వెలుపల భారీ ర్యాలీ నిర్వహించారు.కెనడా, భారత జెండాలు చేతబూని దాదాపు 1000మందికి పైగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ వివరాలను ఉత్తర అమెరికా హిందువుల కూటమి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పంచుకుంది. దీపావళి వారాంతంలో కెనడా అంతటా హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. 

నిరసనలు చట్ట విరుద్ధం..

బ్రాంప్టన్ నగరంలోని హిందూ ఆలయం వద్ద జరిగిన దాడులను నిరసిస్తూ సోమవారం అదే ఆలయం వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన తెలుపుతున్న హిందూ సంఘాలు, హిందువులను కెనడియన్ పోలీసులు హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టడం చట్టవిరుద్ధం అని పోలీసులు మైక్‌లో అనౌన్స్ చేశారు. ఆందోళనకారులు స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. లేనిపక్షంలో లాఠీచార్జితో చెదరగొట్టాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చ రించారు. ఓ కెనడియన్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఆలయం బయట దాదాపు 5వేల మంది ఇండో ముఖ్యం గా హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారని.. వారిలో చాలామంది దగ్గర ఆయు ధాలు కనిపించాయని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా అలాంటి వారిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

పోలీస్ అధికారిపై సప్పెన్షన్ వేటు..

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాదులకు మద్దతు పలుకు తూ హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఆలయంపై దాడి ఘటన సమయంలో ఖలిస్థానీలకు మద్దతు పలికిన పోలీసు అధికారులను గుర్తించిన ప్రభుత్వం.. వీడియో ఫుటేజీ ఆధారంగా ఖలిస్థానీ జెండాలతో వారికి మద్దతుగా నిలవడంతో పాటు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన కెనడా పీల్ ప్రాంత రీజనల్ పోలీసు అధికారి హరీందర్ సోహీపై కెనడా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 

ముక్తకంఠంతో ఖండించిన భారత్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కెనడాలో ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. ‘కెనడాలో హిందూ దేశాలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ దృఢ నిశ్చయాన్ని బలహీనపరచలేవు’ అని మోదీ పోస్టు పెట్టారు. అతివాద శక్తులకు కెనడా రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు. దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులపై వేధింపులు, హింస చూస్తుంటే బాధేస్తోంది అని అన్నారు. కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడి తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సమయంలో అక్కడి హిందూ సమాజానికి రక్షణ వాతావరణాన్ని కల్పించేందుకు కెనడా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని పవన్ కోరారు.