పారిస్: ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కాంస్యం సాధించిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా భారీ నజరానా ప్రకటించింది. కాంస్యం సాధించిన హర్మన్ ప్రీత్ సేనలో ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా అందించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నారు. ‘కఠిన శ్రమ, నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కష్టంతో కాంస్యం దక్కింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో మన జట్టు పతకం గెలవడం అద్భుతం.
రిటైర్మెంట్ ప్రకటించిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు శుభాకాంక్షలు. అతడి వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది’ అని తెలిపారు. ఇక భారత హాకీ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్రం వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఒడిశా ముఖ్యమంత్రి మాంఝీ తమ రాష్ట్రం తరఫున ఆటగాళ్లందరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 10 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు.