8 మందికి గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం
లక్నో, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్ మథురలో ఉన్న ఇండియన్ ఆయిల్ చమురు శుద్ధి కార్మాగారంలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆట్మాస్పియర్ వ్యాక్యూమ్ యూనిట్‌ను తిరిగి స్టార్ట్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్టు ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాద సమయంలో అక్కడ 8 మంది కార్మికులు ఉన్నట్టు చెప్పాయి.
ఇద్దరి శరీరాలు 50 శాతం కాలిపోగా మరో ఇద్దరికి 40శాతం కాలిన గాయాలు అయినట్టు వెల్లడించాయి. మిగిలిన నలుగురు కార్మికులు 20శాతం గాయాలతో బాధపడుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సిటీ హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక వైద్యం అందించినట్టు తెలిపాయి. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించినట్టు వివరించాయి.
కాగా, బాధితుల కుటుంబాలు కంపెనీలో తీసుకునే కార్మికుల రక్షణ చర్యలపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.