calender_icon.png 19 March, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ ఎన్‌కౌంటర్

01-05-2024 01:40:12 AM

పది మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

మృతుల్లో ఇద్దరు మహిళలు

భారీగా ఆయుధాలు స్వాధీనం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో పదిమంది మావోయి స్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో భద్రతా దళాలు ఒక ఏకే 47 మెషీన్ గన్ సహా భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటిల్ ధ్రువీకరించారు. మహా రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని నారాయణపూర్ జిల్లా టేక్మెటా అటవీ ప్రాం తంలో మావోయిస్టుల సంచారం ఉందని సమాచారం అందుకున్న జిల్లా రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బలగాలు సంయుక్తంగా సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈక్రమంలో జవాన్లకు మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య అరగంట వరకు భీకర పోరు జరిగింది.

జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీప్రాంతంలోకి పరారయ్యారు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో పదిమంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే జవాన్లు భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకు న్నారు. ఆప రేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన జవాన్లకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ వర్మ ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఈ నెల ప్రారం భంలో కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో 29 మంది మావో యిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్‌రావు కూడా మృతిచెందారు. ఒకే ఎన్‌కౌంటర్‌లో ఇంత పెద్దసంఖ్యలో మావోయిస్టులు మృతిచెందడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఆ ఘటన మరువకముందే తాజాగా నారాయణ్‌పూర్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఏడాదిలోనే ఎదురుకాల్పుల్లో ఏకంగా 88 మంది మావోయిస్టులు మృతిచెందడం గమనార్హం. 

మావోయిస్టులు లొంగిపోవాలి: భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు

మావోయిస్టుల వైఖరికి విసిగిపోయి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై ఎక్కువ మంది  జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పోలీస్‌శాఖ సైతం చేయూత పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఆరునెలలుగా ఎన్‌కౌంటర్లు సంభవించి సుమారు 350 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారని ప్రకటించారు.  మావోయిస్టులు ఇంటిబాట పట్టాలని ఎస్పీ పిలుపునిచ్చారు. లొంగిపోయిన ప్రతిఒక్కరికీ పునరావాస పథకాలు అందించే ఏర్పాటు చేస్తామన్నారు.